
సాక్షి, హైదరాబాద్ : రాజకీయనాయకుల అక్రమ ఆర్జన విపరీతంగా పెరిగిందని, ప్రజలు దాన్ని ఎదుర్కోవాలని మాజీ హోమ్ సెక్రెటరీ పద్మనాభయ్య పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి పద్మనాభయ్య, పద్మనాభ రెడ్డి, వీవీ రావు, సీఈఓ రజత్ కుమార్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మనాభయ్య మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారని, కానీ వాళ్లకు కోడ్ ఆఫ్ కాండక్ట్ మాత్రం ఉండదని అన్నారు.
రాజకీయ నాయకుల బాధ్యతలు మాత్రం ఎన్నికలకి మాత్రమే అన్నట్లు ఉందని మండిపడ్డారు. ‘గత పాలనా కాలంలో మీరు ఏమి చేశారు’ అని అడగాలని ఓటర్లకు సూచించారు. ఎమ్మెల్యేలలో తీవ్రమైన హత్యా నేరాలు, ఆరోపణలు ఉన్న వారు ఉన్నారని తెలిపారు. పదుల రెట్లు ఆస్తులు పెంచుకున్న వారు ఉన్నారన్నారు. రాజకీయాలు ఒక వ్యాపారంలాగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఫండ్ ఖర్చు వివరాలు కూడా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ‘ఇండియా మారాలంటే అసలు ఓటింగ్ రద్దు చెయ్యాలి’ అన్నట్లు రాజకీయ వ్యవస్థ మారిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment