
రోగుల ఉసురు తాకుద్ది: పొన్నాల
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వృద్ధులు, వితంతు వుల ఉసురే కాదు, టీబీ రోగుల ఉసురూ పోసుకుంటున్నా డని టీ పీసీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న జీవోను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పొన్నాలతో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తదితరులు గురువారం ఛాతీ ఆస్పత్రిని సందర్శించారు.
ఆసుపత్రిని తరలించొద్దు: సీపీఎం
ఛాతీ ఆసుపత్రిని తరలించాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గురువారం సీపీఎం డిమాండ్ చేసింది. అందుబాటులో ఉన్న ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించడంరోగులకు ఇబ్బంది కలిగిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి తరలింపు ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సీఎంకు లేఖ రాశారు.
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆరు బీసీ సంఘాలు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆస్పత్రి తరలింపు వెనుక ప్రభుత్వ కుట్రలున్నాయని, ఇక్కడున్న వేల కోట్ల విలువైన భూమిని దొడ్డిదారిన విక్రయించి అక్రమాలకు పాల్పడాలని చూస్తోందని ఆర్.కృష్ణయ్య (జాతీయ బీసీ సంక్షేమ సంఘం), జాజుల శ్రీనివాస్‌గౌడ్ (రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం), జి.మల్లేష్‌యాదవ్(బీసీ ఫ్రంట్), ప్రొఫెసర్ కె.నటరాజ్ (బీసీ కులాల ఐక్యవేదిక), దుర్గయ్యగౌడ్ (బీసీ సమాఖ్య), కె.శ్రీనివాస్(బీసీ విద్యార్థి సంఘం) ఆరోపించారు.