'ఎవరు వచ్చినా నేను రెడీ'
'ఎవరు వచ్చినా నేను రెడీ'
Published Sat, Aug 26 2017 4:58 PM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM
హైదరాబాద్: కేసీఆర్ వస్తారో.. ! హరీశ్ వస్తారో..! ఎవరు వచ్చినా ప్రాజెక్టులపై చర్చకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలన్నారు. కాళేశ్వరంపై ప్రజాభిప్రాయ సేకరణ టీఆర్‌ఎస్ నేతల బహిరంగ సభలాగా మారిందని విమర్శించారు. పోలీసులతో లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సభల్లో ప్రశ్నించిన లబ్ధిదారులను బయటికి నెట్టేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఫాంహౌస్, ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న నేతలతో సీఎం డబ్బా కొట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
చేతనైతే సర్కారు న్యాయస్థానాలు మొట్టికాయలు వేయకుండా జీవోలు ఇవ్వాలని సవాల్ విసిరారు. తెలంగాణలో నిరంకుశ, ఆటవిక పాలన సాగుతోందని ఆరోపించారు. గడీల పాలన చేస్తున్నారన్నారు. 2015 నవంబర్ వరకు ప్రాణహితకు జాతీయ హోదా అడిగిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రాజెక్టు డిజైన్‌ను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు, ప్రజలు, కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. ప్రజలను ముంచి ప్రాజెక్టులు ఇష్టానుసారం కడితే ఊర్కోబోమని హెచ్చరించారు. నిర్బంధంగా ప్రాజెక్టులు కడతామంటే ప్రజలు తిరుగ బడతారన్నారు.
Advertisement