బియ్యానికి పాలిష్‌ దెయ్యం | Poor quality Rice being polished, sale | Sakshi
Sakshi News home page

బియ్యానికి పాలిష్‌ దెయ్యం

Published Thu, Jun 8 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

బియ్యానికి పాలిష్‌ దెయ్యం

బియ్యానికి పాలిష్‌ దెయ్యం

దొడ్డు బియ్యాన్ని పాలిష్‌ చేసి జనానికి అంటగడుతున్న మిల్లర్లు, వ్యాపారులు
- సన్నబియ్యం పేరిట మార్కెట్‌లో విక్రయాలు
- అన్నం ముద్ద్ద కావడం, జీర్ణ సమస్యలతో ‘ప్లాస్టిక్‌ బియ్యం’అంటున్న జనం
- పాలిష్‌ బియ్యంలో పోషకాలు మృగ్యం.. రోగాలు తప్పవంటున్న వైద్యులు
- ప్రభుత్వం ఇచ్చే రూపాయి కిలో బియ్యంలో 30 శాతం దాకా బయటకే..
- వాటినే సన్నగా, నాజూగ్గా చేసి అధిక ధరలకు అమ్మేస్తున్న మాఫియా
- ప్రభుత్వానికి కూడా వాటినే అంటగడుతున్న వైనం
- ఎక్కడా ప్లాస్టిక్‌ బియ్యం దొరకలేదన్న పౌరసరఫరాల సంస్థ


మహమ్మద్‌ ఫసియొద్దీన్, బొల్లోజు రవి, మేకల కల్యాణ్‌ చక్రవర్తి
ప్లాస్టిక్‌ బియ్యం.. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రజలను భయపెడుతున్న దెయ్యం! సన్న బియ్యం వండగానే అన్నం మెత్తగా, ముద్దలు ముద్దలుగా అవుతుండడం, ముద్ద చేసి నేలకు కొడితే బంతిలా ఎగరడం, రుచి లేకపోవడం, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తడంతో అంతా ప్లాస్టిక్‌ బియ్యంగా అనుమానిస్తున్నారు. ఇవన్నీ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆందోళనలూ పెరిగిపోతున్నాయి. కానీ వీటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. దొడ్డు బియ్యాన్ని అనేకసార్లు పాలిష్‌ చేసి సన్న బియ్యంగా మార్చడం వల్లే జనంలో ‘ప్లాస్టిక్‌ బియ్యం’ఆందోళనలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు సన్నగా, నాజూగ్గా పాలిష్‌ చేసిన ఈ దొడ్డు బియ్యాన్ని తింటే ఆరోగ్యం సంగతి అంతేనని, అనేక వ్యాధులు కొనుక్కున్నట్టేనని, జీర్ణకోశ వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

జరుగుతోంది ఇదీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) కింద తెల్లరేషన్‌ కార్డుదారులకు రూపాయికే కిలో చొప్పున విక్రయిస్తున్న బియ్యంలో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు పక్కదారి పట్టి మాఫియా చేతిలోకి వెళ్తోంది. ఈ బియ్యాన్ని కొందరు రైస్‌ మిల్లర్లు, రేషన్‌ డీలర్లు, బియ్యం వ్యాపారులు కుమ్మక్కై గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా రీసైక్లింగ్‌ చేసి నాలుగైదు సార్లు పాలిష్‌ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు. సన్నబియ్యం పరిమాణానికి తగ్గట్టు 2.5 మి.మీ. పొడవు వచ్చేదాకా పాలిష్‌ చేసి, స్టీమ్‌ చేస్తున్నారు.

ఈ పాలిష్‌ బియ్యాన్ని ఆకర్షణీయమైన బ్రాండ్‌ పేరుతో రంగు రంగుల ప్లాస్టిక్‌ సంచుల్లో బహిరంగ మార్కెట్లో రిటైల్‌ వినియోదారులకు అంటగట్టుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో దొడ్డు బియ్యానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ప్రవేశపెట్టినప్పట్నుంచీ ఈ బియ్యం మాఫియా మరింతగా బరితెగించింది. పేదలకు సబ్సిడీపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి మళ్లీ ప్రభుత్వానికే అధిక ధరకు అంటగట్టుతోంది. ఈ వ్యవహారంలో ఏటా రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయి.

గతంలో విదేశాలకు.. ఇప్పుడు ఇక్కడే..
రేషన్‌ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో బియ్యం మాఫియా రూటు మార్చింది. గతంలో మండల స్థాయి స్టాక్‌(ఎంఎల్‌ఓస్‌) పాయింట్ల నుంచే నేరుగా దొడ్డు బియ్యం లారీలను కాకినాడ పోర్టుకు దారిమళ్లించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేది. నిత్యావసర సరుకుల రవాణా కోసం వినియోగించే లారీలకు జీపీఎస్‌ పరికరాలు అమర్చి వాటి కదలికలను పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తుండడంతో అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కున్నారు. గతంలో మాదిరి దొడ్డు బియ్యాన్ని విదేశాలకు తరలించడాన్ని తగ్గించేశారు. దానికి బదులు రేషన్‌దుకాణాలు, తెల్లకార్డుదారుల నుంచి పెద్దమొత్తంలో సమీకరించిన దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి మార్కెట్‌లోకి, రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టుతున్నారు.]

సన్నబియ్యంగా 30 శాతం దొడ్డు బియ్యం
రాష్ట్రంలో 8,50,450 తెల్లరేషన్‌ కార్డులు ఉండగా, 2.45 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ తెల్లకార్డుల లబ్ధిదారుల కోసం ప్రతి నెలా 1.65 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మిల్లర్ల నుంచి రూ.25 కిలో చొప్పున దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి సబ్సిడీపై రూపాయికి కిలో చొప్పున లబ్ధిదారులకు సరఫరా చేస్తోంది. రవాణా, హమాలీ చార్జీలు కలిపి కిలో బియ్యం వ్యయం రూ.26కు పెరిగిపోతోంది. అయితే ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ బియ్యం తినకుండా దాదాపు 30 నుంచి 40 శాతం లబ్ధిదారులు రూ.10కి కిలో చొప్పున రేషన్‌ డీలర్లకు, బియ్యం వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.

ఇలా పక్కదారిపట్టిన దొడ్డు బియ్యం వ్యాపారులు, డీలర్ల చేతి నుంచి తిరిగి మిల్లర్లకు చేరుతోంది. మిల్లర్లు ఈ బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నంబియ్యం పేరుతో మళ్లీ ప్రభుత్వానికి, ప్రజలకు అంటగట్టుతున్నారు. వివిధ బ్రాండ్ల పేరుతో దాదాపు రూ.48 నుంచి రూ.60 కిలో చొప్పున విక్రయిస్తున్న సన్న బియ్యంలో సగానికి పైగా పాలిష్‌ చేసిన దొడ్డు బియ్యమే ఉంటున్నట్టు సమాచారం. మరోవైపు పీడీఎస్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న మాఫియాపై పౌర సరఫరాల శాఖ సంస్థ గట్టి నిఘా పెట్టింది. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మారుస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే ముగ్గరు రైస్‌ మిల్లర్లు, మరో 5 మంది వ్యాపారులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించింది. త్వరలో మరో 8 మంది నిందితులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. పాత నల్లగొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌ జిల్లాల నుంచే రేషన్‌ బియ్యం ఎక్కువగా పక్కదారి పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

నిగనిగలాడే బియ్యం తయారు చేస్తున్నారిలా..
అప్పుడే కోసిన ధాన్యాన్ని ఉడకబెట్టి, ఆరబెట్టి, మిల్లింగ్‌ చేసి, ఆపై మిక్సింగ్‌ చేసి, గులాబీ రంగు పూసి పాత బియ్యంలా నిగనిగలాడేలా తయారు తయారు చేస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది పాత బియ్యం తినడానికే ఇష్టపడుతుంటారు. అన్నం మెత్తగా కాకపోవడం, పొడిపొడిగా ఉండటమే ఇందుకు కారణం. కానీ కొత్త బియ్యాన్ని పాత బియ్యం మాదిరే తయారు చేసి మార్కెట్‌లోకి పంపి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. కొందరు మిల్లరు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త బియ్యాన్ని పాత బియ్యంగా మారుస్తున్నారిలా..

అప్పుడే కోసిన (నిన్న కోసిన పంటను నేడు) ధాన్యాన్ని ముందుగా ఉడకబెడతారు. అది కూడా పూర్తిగా కాకుండా హాఫ్‌ బాయిల్‌ చేస్తారు. తర్వాత ఆరబెడతారు. ధాన్యం ఆరిపోయిన తర్వాత మిల్లింగ్‌ చేస్తారు. తర్వాత బియ్యానికి సిల్కీ పాలిషింగ్‌ చేస్తారు. దీంతో బియ్యం నునుపు వస్తుంది. అలా నునుపు వచ్చిన బియ్యం అచ్చం పాత బియ్యంలాగానే ఉంటుంది. ఈ బియ్యాన్ని, అంతకు ముందే పెట్టుకున్న అసలైన పాత బియ్యానికి 50:50 నిష్పత్తిలో కలుపుతారు. ఇలా కలిపిన పాత, కొత్త బియ్యానికి లేత గులాబీ రంగు పూత అద్దుతారు. బియ్యాన్ని ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ఇంత చేయడానికి మిల్లర్‌కు క్వింటాల్‌కు రూ.100 కన్నా కాస్త ఎక్కువ ఖర్చవుతుంది. ఇక రవాణా ఖర్చులు, ప్యాకింగ్‌ ఖర్చులు పోను పాత బియ్యం పేరుతో కొత్త బియ్యాన్ని అమ్మితే ఇప్పుడున్న మార్కెట్‌ ధరలో క్వింటాల్‌కు రూ.750 వరకు మిల్లర్లు దండుకుంటున్నారని తెలుస్తోంది.

ఎక్కడ చేస్తున్నారు..?
బియ్యాన్ని ఉడకబెట్టే పారా బాయిల్డ్‌ పరిశ్రమ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువగా ఉండడంతో పాటుహైదరాబాద్‌కు రవాణా చేయడం సులువు కావడంతో అక్కడే ఈ దందా ఎక్కువ జరుగుతోందని సమాచారం. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ మార్కెట్లలో కొన్న కొత్త ధాన్యాన్ని హైవే మీద సూర్యాపేట నుంచి చిట్యాల వరకు ఉన్న పారా బాయిల్డ్‌ మిల్లుల్లో ఉడకబెట్టిస్తున్నారని, నాగార్జునసాగర్‌ ఆయకట్టులోని ధాన్యాన్ని మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడల్లోని మిల్లులో ఉడకబెట్టిస్తున్నారని తెలుస్తోంది. నల్లగొండతో పాటు కల్వకుర్తిలో కూడా కొంత బాయిల్‌ చేస్తున్నారు.

ఇలా బాయిల్‌ చేసిన బియ్యాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగలపల్లి, బొంగులూరు సమీపంలో ఉన్న వందలాది మిల్లుల్లో మర పట్టించి, ప్యాక్‌ చేసే ప్రక్రియ నడుస్తుందనే ఆరోపణలున్నాయి. అక్కడ్నుంచి హైదరాబాద్‌లో ఉన్న కర్మాన్‌ఘాట్‌ బియ్యం హోల్‌సేల్‌ మార్కెట్‌కు తరలించి అక్కడ మార్కెట్‌ చేస్తారని సమాచారం.

ఐదు ప్రత్యేక బృందాలతో తనిఖీలు
రాష్ట్రంలో రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల సంస్థ ఐదు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా రైస్‌ మిల్లులు, రేషన్‌ షాపుల్లో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. గత జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు జరిపిన దాడుల్లోనే 1795.32 టన్నుల బియ్యం పట్టుబడింది. ప్లాస్టిక్‌ బియ్యం వదంతుల నేపథ్యంలో దాడులు మరింత పెంచేందుకు సన్నద్ధమవుతోంది.

సన్న బియ్యం కాదు.. దొడ్డు బియ్యం..
హైదరాబాద్‌ నారాయణగూడకు చెందిన 35 ఏళ్ల వెంకటేశ్‌ ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఏ మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం తప్ప తగ్గడం లేదు. దీంతో నగరంలో పేరుపొందిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడిని కలిశాడు. జీర్ణవ్యవస్థ దెబ్బతిందని డాక్టర్‌ తేల్చారు. జీర్ణకోశ వ్యాధి ముదిరిందని, అల్సర్స్‌ ఏర్పడుతున్నాయని, తక్షణమే వైద్యం చేయించుకోకపోతే కేన్సర్‌కు దారితీస్తుందని హెచ్చరించారు. తాను వాడుతోంది సన్నబియ్యమని, స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేస్తానని డాక్టర్‌కు వెంకటేశ్‌ వివరించాడు. చివరకు అతను తినేది దొడ్డుబియ్యాన్ని సన్నబియ్యంగా మార్చిన బియ్యమని తేలింది.

జీర్ణవ్యవస్థకు దెబ్బ: డాక్టర్‌ జయలత, డైరెక్టర్, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌
పాలిష్, ఇతరత్రా కల్తీ బియ్యంతో జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అన్నం అరగాలంటే ఎంజైములు అవసరం. అలాంటి ఎంజైములను ప్లాస్టిక్‌ రైస్‌ నాశనం చేస్తాయి. అత్యంత విషపూరితమైన యాసిడ్స్‌ రక్తంలోకి చేరుతాయి. ఇవన్నీ దీర్ఘకాలంలో కేన్సర్‌కు దారితీస్తాయి.

రీసైక్లింగ్‌తో ప్రోటీన్లు పోతాయి: డాక్టర్‌ కె.రాకేశ్, సీనియర్‌ కన్సల్టెంట్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు, ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌
కల్తీ, ప్లాస్టిక్‌ బియ్యంతో పొట్ట ఉబ్బరం ఏర్పడుతుంది. మలబద్దకం ఏర్పడుతుంది. కేన్సర్‌కు దారితీస్తుంది. దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేయడం వల్ల ప్రొటీన్లు పోతాయి. దీంతో పిల్లలు, పెద్దల్లో గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఏర్పడుతాయి.

ఆస్ట్రియో ఫోరోసిస్‌కు దారి తీస్తుంది: డాక్టర్‌ టి.దశరథరామిరెడ్డి, ఛీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్, యశోద ఆసుపత్రి, హైదరాబాద్‌
అధికంగా పాలిష్‌ చేసిన బియ్యంతో ఎముకలకు సరిపడా పోషకాలు అందవు. దీంతో ఆస్ట్రియోఫోరోసిస్‌ వ్యాధి వస్తుంది. చిన్నచిన్న దెబ్బలకే ఎముకలు విరిగే పరిస్థితి ఏర్పడుతుంది.

ప్లాస్టిక్‌ బియ్యం ఎక్కడా దొరకలేదు: సీవీ ఆనంద్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
ప్లాస్టిక్‌ బియ్యాన్ని ఇప్పటివరకు ఎక్కడా కనుగొనలేదు. ఎక్కడా దొరకలేదు. మీర్‌పేటలో దొరికిన ప్లాస్టిక్‌ బియ్యంగా చెప్పే వాటిని పరీక్షించాం. అందులో ప్లాస్టిక్‌ బియ్యం లేదని ప్రాథమికంగా నిర్ధారించాం. పాలు, పళ్లు అన్నీ కల్తీ అవుతోన్న నేపథ్యంలో బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం కల్తీ అవుతున్నాయన్న వాదనను తోసిపుచ్చలేం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలకు ఆదేశాలిచ్చాం. ప్లాస్టిక్‌ బియ్యముంటే అవి నీటిలో తేలుతాయి.

అవి ప్లాస్టిక్‌వి కావు: మార్కెట్‌లో ప్లాస్టిక్‌ బియ్యం ఉన్నాయన్నది అపోహ. అవి హాఫ్‌ బాయిల్డ్‌ బియ్యం. ప్రభుత్వ అధికారుల అలసత్వం కారణంగా ఈ బియ్యం విచ్చలవిడిగా మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయి. కొందరు మిల్లర్ల దురాశే ఈ పరిస్థితికి కారణం -దేవరకొండ నాన్‌ ట్రేడింగ్‌ రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నక్కా భువనేశ్వర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement