ఎండలో ఆరబెట్టిన కుండలు
సాక్షి,ఖిల్లాఘనపురం: జిల్లాలోనే ఖిల్లాఘనపురం కుమ్మరులు తయారు చేసే కూజల(నీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసే కుండల)కు ఎంతో పేరుంది. ఇక్కడి కుమ్మరులు ఎండాకాలంలో ఈ కూజలు, కుండల తయారీపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఎంతో అందంగా చూడముచ్చటగా ఉండే ఈ కుండలంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఏళ్లు గడుస్తున్నా వాటి క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇక్కడి కుండలు మార్కెట్లో ఉంటే మరే ఇతర కుండలు కొనేందుకు ప్రజలు ఇష్టపడరు.
తయారీలో ప్రత్యేక నైపుణ్యం
ఖిల్లాఘనపురం కుమ్మరులు కుండల తయారీలో ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చెరువుల నుంచి తెచ్చిన మట్టిని ఎండలో ఆరబెట్టి పొడిగా తయారు చేస్తారు. తరువాత నీటితో కలిపి పలుచగా తయారు చేసి వడబోస్తారు. మట్టిలో చిన్నపాటి ఇసుక రేనువులు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నీటిశాతం తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి రెండు రోజుల తరువాత ముద్దగా తయారు చేస్తారు. తరువాత కొద్ది కొద్దిగా మట్టిని సారి(కుమ్మరి చక్రం)పై వేసుకుని కుండలను అందంగా తయారు చేస్తారు.
ఆరిన కుండలను 12గంటల పాటు ఆము(కుమ్మరి పొయ్యి)లో కాల్చడం జరుగుతుందని కుమ్మరులు తెలిపారు. ఒక్క ఆములో 250నుంచి 300 కుండల వరకు కాల్చడం జరుగుతుంది. ఈ కుండలను భార్య భర్తలు ఇద్దరు కలిసి 15 రోజుల్లో తయారు చేయడం జరుగుతుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాల నుంచి వ్యాపారులు ఒక్కో కుండను ఇంటివద్దకే వచ్చి రూ.50 నుంచి రూ.100లకు కొనుగోలు చేసి తీసుకెళ్తారని పలువురు పేర్కొన్నారు. అక్కడ ఒక్కో కుండను రూ.200 నుంచి రూ.300వరకు విక్రయిస్తారని సమాచారం.
కుండల తయారీతో ఉపాధి
మండలంలో మొత్తం 80శాలివాహన కుటుంబాలు ఉన్నాయి. వీరు వేసవిలో కూజలు, కుండల తయారీతో ఉపాధి పొందుతారు. కుటుంబ సమేతంగా కష్టపడి కుండలు తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. ఖర్చులుపోను ఒక్కో కుటుంబం రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తారు. అయితే, ప్రభుత్వం తమకు ఆర్థికంగా సహకారం అందిస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కుండలను సరఫరా చేసి జిల్లాకే పేరు తెస్తామంటున్నారు ఇక్కడి కుమ్మరులు.
కనీసం ప్రభుత్వం నుంచి సబ్సిడీపై రుణసౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వృత్తిపై మక్కువ, తయారీలో నైపుణ్యం ఉన్న ఇలాంటి కుమ్మరులకు సహకారం అందిస్తే ఆర్థికంగా ఎదగడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంచి గుర్తింపు తెస్తారని వివిధ పట్టణాల నుండి ఇక్కడకు కుండలు తీసుకెళ్లేందుకు వచ్చే వ్యాపారులు, ప్రజలు అంటున్నారు.
పేదోడి ఫ్రిజ్‌గా పేరు
వేసవికాలం వచ్చిందంటే చాలు కొద్దో గొప్పో ఉన్నోళ్లు ఫ్రిజ్‌లు కొనుగోలు చేస్తారు. పేదోళ్లు మాత్రం మట్టితో తయారుచేసిన కొత్త కుండల్లో నీరు ఉంచి తాగేందుకు ఇష్టపడతారు. అందుకే కుండలను పేదవాడి ఫ్రిజ్‌గా పిలుస్తారు. అలాంటి కుండలకు ఉమ్మడి పాలమూరులోనే ఖిల్లాఘనపురం కుండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇక్కడ తయారుచేసిన కూజ, కుండలకు హైదరాబాద్‌తోపాటు కర్నూల్, మహబూబ్‌నగర్ తదితర పట్టణాల్లో మంచి గిరాకీ ఉంది. రాష్ట్ర రాజధానిలో రోజువారి కూలీలు, వలసల వచ్చిన కూలీలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి కుండలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.
ఉపాధి పొందుతున్నాం
ఎండాకాలంలో పట్టణాలకు వలసపోకుండా కులవృత్తి ద్వార ప్రత్యేకమైన కూజలు తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాం. కుటుంబ సమేతంగా కష్టపడి రూ.70 నుంచి రూ.లక్ష వరకు సంపాదించడం జరుగుతుంది.
– కుమ్మరి శ్రీనివాసులు, ఖిల్లాఘనపురం
Comments
Please login to add a commentAdd a comment