పేదరిక నిర్మూలనకే ‘తెలంగాణ పల్లె ప్రగతి’ | Poverty Alleviation 'Spicy progress in the country' | Sakshi
Sakshi News home page

పేదరిక నిర్మూలనకే ‘తెలంగాణ పల్లె ప్రగతి’

Published Sun, Aug 23 2015 2:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పేదరిక నిర్మూలనకే ‘తెలంగాణ పల్లె ప్రగతి’ - Sakshi

పేదరిక నిర్మూలనకే ‘తెలంగాణ పల్లె ప్రగతి’

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది
పదేళ్లలో మీరు చేయని అభివృద్ధి మేం చేస్తున్నాం.. మీకేంటి నొప్పి?
కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు
కౌడిపల్లిలో తెలంగాణ పల్లెప్రగతి ప్రారంభించిన మంత్రులు

 
కౌడిపల్లి: పేదరిక నిర్మూలనకే ప్రభుత్వం తెలంగాణ పల్లెప్రగతి పథకం ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని, ఫలితంగా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని వచ్చే ఐదేళ్లలో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పల్లెప్రగతి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రపంచ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం రూ.642 కోట్లతో రాష్ట్రంలోని 150 మండలాల్లో పేదలకు, ఇతరులకు జీవనోపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 4.20 లక్షల స్వయం సహా యక సంఘాలు రూ. ఐదు వేల కోట్లు రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నారని, దేశంలోనే ఇంత ఎక్కువసంఖ్యలో మహిళలకు ఏ రాష్ట్రం రుణాలు ఇవ్వడం లేదన్నారు. గ్రామాల్లో ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాలు’ ఏర్పాటుచేసి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్, దేశం కళ్లులేని కబోదులు: హరీశ్
 కాంగ్రెస్, టీడీపీ నాయకలు కళ్లులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లిదయాకర్‌రావులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా? అన్నారు. ఈ అభివృద్ధి మాటున తామెక్కడ గల్లంతవుతామనే భయం వారిదని ఆయన ఎద్దేవా చేశారు.

 స్త్రీల సంపాదనతోనే అభివృద్ధి: పోచారం
 గ్రామాల్లో మహిళల సంపాదన బాగుంటేనే కుటుంబం వృద్ధి చెందుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పల్లెప్రగతితో మహిళలకు బాగా లబ్ధి చేకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రేమండ్‌పీటర్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు పరమేశ్, శాఖశెట్టి వినయ్‌కుమార్, సెర్ప్ సీఈవో మురళి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
 
అఖండజ్యోతిలా గ్రామజ్యోతి

నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం.. వారం పది రోజుల కోసం చేస్తున్నది కాదనీ, అఖండ జ్యోతిలా ఎల్లప్పుడూ వెలుగొందాలనే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమమని రాష్ర్ట పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం ఆయన నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ  చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, పారిశ్రామిక విధానాలకు దేశంలో మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. గ్రామప్రజల భాగస్వామ్యంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకే గ్రామజ్యోతి చేపట్టినట్లు కేటీఆర్ చెప్పారు.

150 మండలాల్లో పల్లెప్రగతి అమలు
రాష్ట్రంలో పల్లెప్రగతి పథకాన్ని 150 మండలాల్లో అమలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూ.652 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో రెండున్నర లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల కంటే మెదక్ జిల్లా పన్నుల వసూలులో ప్రథమ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ కితాబునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement