కోతలయ్యాయ్.. ఇక వాతలే!
రూ. 4,000 నుంచి 4,500 కోట్ల మేర చార్జీల వడ్డనకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: నిన్న, మొన్నటి వరకూ విద్యుత్ కోతలతో అల్లాడిన ప్రజలకు కరెంట్ చార్జీల షాక్ ఇచ్చేందుకు సర్వం సన్నద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కొనుగోలు భారం అంచనాలను దాటడంతో ప్రజలపై చార్జీల భారం మోప డం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.4,000 నుంచి 4,500 కోట్ల మేర చార్జీల వడ్డన ప్రతిపాదనలకు డిస్కంలు తుది మెరుగులు దిద్దుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గృహ వినియోగదారులకు సంబంధించి 50 యూనిట్లలోపు కేటగిరీని 30 యూనిట్లకు కుదించనున్నారు. ఇంతకంటే ఎక్కువ కరెంటు వాడేవారు తర్వాతి కేటగిరీలోకి(31-100) వస్తారు. తెలంగాణలో మొత్తం 81 లక్షల మంది గృహ వినియోగదారులున్నారు. 0-50 యూని ట్ల కేటగిరిలోని దాదాపు 70 శాతానికి పైగా వినియోగదారులు 30 యూనిట్లకు మించి విద్యుత్తు వాడుతున్న వారే. వీరిని రెండో కేటగిరీకి బదిలీ చేస్తే ఆదాయం పెరగడం, గృహ వినియోగదారుల సబ్సిడీభారం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అందరిపైనా బాదుడే..
2014-15 ఆర్థిక సంవత్సరం చార్జీల ప్రతిపాదనల్లో టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్(పాత సీపీడీసీఎల్)లు దాదాపు రూ.5 వేల కోట్ల మేర చార్జీల పెంపును ప్రతిపాదించాయి. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో అవి అమలు కాలేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం 50 యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడే గృహాలకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున వసూలు చేస్తున్నారు. 2014-15 ప్రతిపాదనల్లోనే ఈ చార్జీని డిస్కంలు రూ.1.95కు పెంచాయి. తాజా ప్రతిపాదనల్లో ఈ కేటగిరీని 1-30 యూనిట్లకు పరిమితం చేసిన డిస్కంలు.. యూనిట్‌కు దాదాపు అదే చార్జీని వసూలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. 31-100 యూనిట్ల కేటగిరీలో రూ.4 లోపు వసూలు చేయాలని యోచిస్తున్నాయి. దీంతోపాటు విద్యుత్తును ఆదా చేసే చర్యల్లో భాగంగా... వినియోగం ఎక్కువగా ఉంటున్న పీక్ అవర్స్‌లో టారిఫ్‌ను పెంచాలని, టైమ్ ఆఫ్ ది డే(టీవోడీ) టారిఫ్‌ను అమలు చేయాలనే విషయాన్నీ పరిశీలిస్తున్నాయి. గతేడాది పరిశ్రమల(హెచ్-3) కేటగిరీలో సాయంత్రం 6 నుంచి రాత్రి పది గంటల వరకు టీవోడీ చార్జీ విధిస్తూ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఈసారి ప్రతిపాదనల్లో టీవోడీ చార్జీలను మరిన్ని కేటగిరీలకు విస్తరించాలని పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే.. సాధారణ సమయంలో ఉన్న యూనిట్ రేటుతో పోలిస్తే.. పీక్ అవర్స్‌లో రూపాయిన్నర చొప్పున అదనంగా వసూలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి.
గతేడాది వార్షిక నివేదికలో టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ తమకు రూ.7,046.95 కోట్ల ఆదాయం అవసరమని అంచనా వేసింది. ఇప్పుడున్న విద్యుత్తు చార్జీల ప్రకారం రూ. 3,663 కోట్లు సమకూరుతాయని.. పెంచిన చార్జీలతో రూ.871 కోట్లు అదనంగా రాబట్టుకోవాలని నిర్ణయించింది. సీపీడీసీఎల్ విషయానికొస్తే గతేడాది రూ.22,754 కోట్ల ఆదాయం అవసరం అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత చార్జీల ప్రకారం రూ.17,307 కోట్లు వస్తుందని.. రూ.4,296 కోట్ల మేర చార్జీలను పెంచడం ద్వారా లోటును పూరించుకోవాలని ప్రతిపాదనలు చేసింది. గతేడాది దీని పరిధిలో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలు ఏపీలో చేరటంతో ఈ డిస్కం పరిధి తగ్గింది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌గా ఆవిర్భవించింది. తన పరిధిలో లేని రెండు జిల్లాల ఆదాయ వ్యయాలను తాజా వార్షిక రాబడి అంచనా(ఏఆర్‌ఆర్)లో తొలగించి.. రూ.3 వేల కోట్ల మేర ఆదాయం రాబట్టేలా చార్జీల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ లెక్కన తెలంగాణలో మొత్తం రూ.4,000 నుంచి రూ.4,500 కోట్ల మేరకు చార్జీలను వడ్డించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌లను నవంబరు నెలాఖరున తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి డిస్కంలు సమర్పించాలి. ఈనెల 12లోగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. ఆలోపే ఏఆర్‌ఆర్‌లు సమర్పిస్తామని డిస్కం వర్గాలు తెలిపాయి.