
హైదరాబాద్ :
తెలంగాణలో ఒక్క నిమిషం కరెంటు పోవడం లేదు. సిరిసిల్లలో సన్నాసులు ఉన్నట్లుంది.అందుకే బహిరంగ సభలో కరెంట్ పోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. సన్నాసులను బాగుచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. బైపాస్ రోడ్ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, అపెరల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 'సిరిసిల్ల జిల్లా ప్రజలకు అభినందనలు. మీ ఎమ్మెల్యే రామారావు బాగా హుషారయిండు. మొదట జిల్లా ఇస్తే చాలన్నడు. ఇప్పుడు రెండు మూడు వందల కోట్లకు టెండర్ పెట్టిండు. బూదాన్ పోచంపల్లిలో ఆనాడు ఏడుగురు నేత కార్మికులు చనిపోతే ఆనాటి ప్రభుత్వం 50 వేలు ఇవ్వలేదు. ఆరోజే అనుకున్నం తెలంగాణా వచ్చాక నేతకార్మికు జీవితాలు బాగుచేయాలని. సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తొలిస్థానంలో ఉన్నం. 44 వేల కోట్లు కేటాయిస్తున్నాం.
బీడి కార్మికులు, ఒంటరి మహిళలకి పించన్లు ఇస్తున్నాం. ప్రైవేటు డాక్టర్లు వేలకు వేలు దోచుకుంటున్నారని కేసీఆర్ కిట్టు ప్రవేశపెట్టాం. 800 కోట్లు సిరిసిల్ల అభివృద్దికి కేటాయిస్తున్నాం. చేనేత కార్మికులకు 50% సబ్సిడీ ఇస్తున్నాం. ప్రభుత్వానికి కావాల్సిన బట్టలు మరమగ్గాల కార్మికులతోనే తయారు చేయిస్తున్నాం. బతుకమ్మ బట్టలపై అనవసర రాద్దాతం చేశారు. వారికి మీరే బుద్ది చెప్పాలి. ప్రతి కార్మికుడికి నెలకు 15 వేలు అందేలా చర్యలు చేపడతాం. కేటీఆర్ కోరినట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 130 కోట్లు రేపే విడుదల చేస్తాను. గ్రామపంచాయితీల అభివృద్దికి నిధులు కేటాయిస్తాం. తండాలకు 10 లక్షలు కేటాయిస్తాం. భారతదేశంలోనే ధైర్యంగా సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం మనదే. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం నీళ్లు రాకుండా కోర్టులకు వెళుతున్నారు. ఎవరు అడ్డుపడినా కాళేశ్వరం నీళ్లతో మీ కాళ్లు కడుగుతా. చేనేత కార్మికులతో పాటు మత్స కార్మికులు, గొల్లకుర్మలకు అనేక నిధులు కేటాయిస్తున్నాం. రైతు సమితుల ఆధ్వర్యంలో పంటలు వేసి ధరలు రాబట్టాలి. ఆకుపచ్చ, చిరునవ్వుల తెలంగాణా నా స్వప్నం' అని కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment