అండగా ఉంటాం..ఆదుకుంటాం | Praveen togadia given support to hindus | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం..ఆదుకుంటాం

Published Thu, Dec 11 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

అండగా ఉంటాం..ఆదుకుంటాం

అండగా ఉంటాం..ఆదుకుంటాం

హిందువుల సంరక్షణే వీహెచ్‌పీ ధ్యేయం
ప్రవీణ్ తొగాడియా


సంగారెడ్డి క్రైం: పేద హిందువుల సంరక్షణ, సమృద్ధే విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్‌పీ) ధ్యేయమని, దేశంలో పేద హిందువులకు ఆకలి బాధలు లేకుండా చేయడమే లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు డా. ప్రవీణ్ బాయ్ తొగాడియా అన్నారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రభుత్వాలు, అధికారం తమ వద్ద లేకున్నప్పటికీ, నిరుపేద హిందువులను ఆదుకునేందుకు వీహెచ్‌పీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

హిందూ ధర్మంపై క్రిష్టియన్ల దాడి కొనసాగుతోందని, ప్రతి ఒక్క హిందువు దాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే హిందూ ధర్మానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందన్న విషయాన్ని హిందువులంతా గమనించాలన్నారు. కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో నేడు హిందూ ధర్మం క్షీణించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో హిందువులు మచ్చుకైనా కనిపించకుండా పోయారన్నారు. నేడు ప్రేమ వివాహాల పేరిట హిందు యువతులను ముస్లింలు పెళ్లి చేసుకొని వారి మతంలో కలుపుకోవడం బాధిస్తోందన్నారు. ప్రతి ఒక్క హిందువు పిడికెడు బియ్యం ఇచ్చిపేద హిందువులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

దళితులు వంటింట్లోకి వచ్చి భోజనం చేసే విధమైన హిందూ ధర్మ సంఘటిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి  పాటు పడాలన్నారు. హిందువులంతా జాగృతమై హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోవాలని కోరారు.  హిందూ ధర్మ రక్షణ కోసం సోషల్ మీడియా ద్వారా నిరంతర ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని ఐకమత్యంగా కాపాడాలన్నారు. గోవులను పూజించాలని చెప్పారు. వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ, హిందువులంతా చైతన్యవంతులై హిందూ మతంపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలన్నారు. పశువులను వధించే పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేశారు.

హిందూ ధర్మ రక్షణకోసం వీహెచ్‌పీ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. బుదేరాలో రామరథం యాత్రపై  క్రైస్తవులు దాడి చేస్తే పోలీసులు వారిని వదిలి హిందువులపై కేసులు పెట్టారని ఆరోపించారు. హిందువులంతా సంఘటితమైతేనే దాడుల నివారించవచ్చన్నారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు పన్యాల ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లాలోని అల్లానా, అల్‌కబీర్ పశువధ ఫ్యాక్టరీలను మూసివేయాలని వీహెచ్‌పీ విస్తృత పోరాటం చేసిందన్నారు. కానీ ఆ పరిశ్రమలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్‌పీ నేత ఆకుల రాజయ్య మాట్లాడుతూ, హిందూ సమాజ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలని కోరారు. జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన భూమిని, గోవును పూజించాలన్నారు.

దేశ రక్షణలో హిందువులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు కమలానంద భారతి, సంగ్రామ్ మహరాజ్, రాజయోగి వెంకట్‌స్వామి, దేవగిరి మహరాజ్, మఠం రాచయ్య, సిద్దలింగ మహరాజ్, నీటకంఠ స్వామి, బస్వలింగ అవదూత తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నేత మధురనేని సుభాష్‌చందర్, రాందాస్, పురం సంతోష్‌కుమార్, బస్వరాజ్ పాటిల్, సులుగంటి సిద్దేశ్వర్, విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు.

భారీ పోలీసు బందోబస్తు        
విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వీహెచ్ పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా, అధ్యక్షుడు రాఘవరెడ్డిలు హాజరుకావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలను కట్టడి చేశారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతనే సభలోకి అనుమతించారు.  

సమ్మేళనంలో అన్నదానం
విరాట్ హిందూ సమ్మేళనానికి జిల్లా నలుమూలల నుంచి హాజరైన వారికి వీహెచ్‌పీ నేత బిడెకన్నె హన్మంతు అన్నదానం చేశారు. మరోవైపు సంగారెడ్డి పట్టణంలోని క్లాత్ అండ్ రెడీమేడ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వస్త్ర దుకాణాలను బంద్ నిర్వహించారు. సభా ప్రాంగణంలో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే విరాట్ హిందూ సమ్మేళనంలో భాగంగా హోమం కూడా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement