praveen togadia
-
మోదీపై తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల ఓట్లతో గెలిచి, ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రస్తుతం ముస్లిం మహిళల తరపు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారంటూ విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం వర్గం వ్యక్తిగత అంశమని.. ఆ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవాదం, హిందుత్వ నినాదాలతో అధికారంలోకి వచ్చిన మోదీ.. హిందూ దేశాన్ని, కశ్మీర్లో ఉన్న హిందువులను రక్షించాల్సిందిపోయి ముస్లింల వకాల్తాదారుగా వ్యవహరించడం బాగోలేదంటూ విమర్శించారు. బీజేపీనా.. మినీ కాంగ్రెస్ పార్టీయా మథురలో జరగిన ఓ సమావేశానికి హాజరైన తొగాడియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న వారంతా బీజేపీని మినీ కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నారని ఆరోపించారు. అందుకే బీజీపీ హిందువుల సంక్షేమం గురించి పట్టించుకోవడం మానేసి ముస్లింల జపం చేస్తుందంటూ విమర్శించారు. మోదీ ప్రభుత్వం గోరక్షకులను గూండాలుగా.. గూండాలను(మాజీ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి) సోదరులుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉండి కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా సింహాసనం ఎక్కేందుకే మోదీ రాముడి పేరు వాడుకున్నారని.. అధికారంలోకి రాగానే అసలు విషయం పక్కనపెట్టేశాని ఘాటుగా విమర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగురుతున్నా హిందువులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని తొగాడియా ఆవేదన వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణం విషయంలో వీహెచ్‌పీ అధ్యక్షుడిగా తన శాయశక్తులా ప్రయత్నించిన లాభం లేకపోయిందని వాపోయారు. -
తొగాడియా కొత్త హిందూ పార్టీ
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ (ఏహెచ్‌పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వీహెచ్‌పీ నుంచి బహిష్కరణకు గురైన తొగాడియా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ‘హిందూ ప్రత్యామ్నాయం’గా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘2014 ఎన్నికల్లో బీజేపీ వెన్నంటి ఉండి గెలిపించిన హిందువులను మోదీ ప్రభుత్వం వంచించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లేదు. యువతకు మాట ఇచ్చినట్లు 10 కోట్ల ఉద్యోగాలు రాలేదు. రైతులు రోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు’ అంటూ బీజేపీ, మోదీపై విరుచుకుపడ్డారు. -
బీజేపీని గెలిపించింది మందిర నిర్మాణానికే
ఔరంగాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికే ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించారని, ట్రిపుల్ తలాక్‌పై చట్టాలు చేయడానికి కాదని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేసిన తొగాడియా..రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా చట్టం చేయాలన్నారు. ‘ప్రజలు మీకు ట్రిపుల్ తలాక్‌పై చట్టాలు చేయడానికి ఓట్లేయలేదు. రామ మందిర నిర్మాణం కోసమే పట్టం గట్టారు’ అని ఔరంగాబాద్‌లో అన్నారు. ట్రిపుల్ తలాక్‌పై చట్టం చేయడం, చేయకపోవడం ప్రభుత్వ ఇష్టమని, కానీ రామ మందిర నిర్మాణానికి మాత్రం చట్టం రూపొందించాలన్నారు. -
ఆర్ఎస్ఎస్లో కలకలం ; ప్రవీణ్ తొగాడియాపై వేటు?
న్యూఢిల్లీ : వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాపై మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ తీవ్ర చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ‘పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారం’టూ ఇటీవల తొగాడియా చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చడమేకాక బీజేపీ ప్రభుత్వాలను ఇరుకునపెట్టేలా ఉన్నాయని పరివార్ పెద్దలు భావిస్తున్నారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా తొగాడియాను, అతని అనుకూలురు మరో ఇద్దరిని సంస్థాగత పదవులనుంచి తప్పించనున్నట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. వేటుకు గురికానున్నవారి జాబితాలో తొగాడియాతోపాటు భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డిల పేర్లు ఉన్నాయి. అయితే సంఘ్ పరివార్‌కు చెందిన ఏ సంస్థా అధికారికంగా ఈ విషయాలను నిర్ధారించలేదు. అయితే, తొగాడియా ఆరోపణల అనంతరం పరివార్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన నేపథ్యంలో ఊహించని మార్పులు తప్పవని ఢిల్లీ, నాగ్‌పూర్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. పరివార్‌కు సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే ‘ప్రతినిధి సభ’ జరగడానికి ముందే నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి. మోదీ వర్సెస్ తొగాడియా : అజ్ఞాతం నుంచి గత సోమవారం మీడియాముందుకు వచ్చిన ప్రవీణ్ తొగాడియా.. తనను పోలీస్ ఎన్కౌంటర్లో చంపేందుకు కుట్ర జరిగిందని చెప్పుకొచ్చారు. ‘నా నోరు మూయించేందుకు సెంట్రల్ ఏజెన్సీలను మోహరించారు’ అని కన్నీటిపర్యంతమయ్యారు. తొగాడియా ఆరోపణల అనంతరం సంఘ్‌పరివార్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సంపూర్ణ గోవధ నిషేధం అంశాల్లో మోదీ నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తొగాడియా గతంలోనూ పలుమార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. మరో కథనం ప్రకారం.. తొగాడియా ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. దాదాపు పూర్తికావచ్చిన ఆ పుస్తకంలో మోదీ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలున్నట్లు సమాచారం. రామజన్మభూమి ఉద్యమం ద్వారా బీజేపీ ఏ విధంగా రాజకీయ లబ్ధిపొందిందీ, ఏయే నాయకులు ఏ విధంగా లాభపడిందీ తదితర అంశాలు కూడా పొందుపర్చారని తెలిసింది. ఆ పుస్తకం 2019 ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశంఉన్నందున తొగాడియా విషయంలో ఆర్ఎస్ఎస్ ఏదోఒక కఠిన నిర్ణయం తీసుకుంటుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే ఈ విషయాలేవీ అధికారికంగా వెల్లడికాలేదు. -
మతప్రాతిపదికన రిజర్వేషన్లను అడ్డుకోవాలి
వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియా హైదరాబాద్: రాజ్యాంగ నిబంధనలకు విరు ద్ధంగా మత ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రిజర్వేషన్లను అడ్డుకోవాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ తొగా డియా పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని పటేల్ ఘన్‌శ్యామ్ భవన్లో రెండోరోజు జరిగిన బజరంగ్దళ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మతప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించడం అనైతికమని, ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఓట్ల కోసం సమాజాన్ని చీల్చడం దేశ ద్రోహమన్నారు. సంక్షేమ చట్టాలు ప్రజల మధ్య చిచ్చు పెట్టేవిగా ఉండొద్దని అన్నారు. హజ్ యాత్ర పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రాలైన మానస సరో వరం, తిరుమల తిరుపతి దేవస్థానం, వారణాసికి వెళ్లే భక్తులకు ఎంత సబ్సిడీ ఇస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి, బతుకమ్మ, బోనాలకు డీజేలను అనుమతిం చకపోవడం, హిందువుల పండు గలకు ఆంక్షలు విధించడం, ముస్లింల పండుగలకు అన్ని విధాలుగా సహకరించడాన్ని బట్టి రాష్ట్రంలో హిందూవ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని స్పష్టమవుతోందని అన్నారు. హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని, హిందూ వ్యతిరేక చర్యలను ఖండించి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని, అప్పుడే ప్రతి హిందువుకు మానసిక ధైర్యం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠినంగా గో రక్షణ చట్టాలను అమలు చేయాలని సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను విడిపించుకోవడం, కశ్మీర్లో అల్లర్లను చల్లార్చడం, చైనా దురాక్రమణలను అడ్డుకోవడం, చైనా వస్తువులను నిషేధించడం, గో సంరక్షణ చేపట్టాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో బజరంగ్దళ్ అఖిల భారతీయ సంయోజక్ మనోజ్శర్మ, సోలంకి సోనాల్, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, ఉపాధ్యక్షుడు సుభాశ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రదాడి జరిగినా సడలని సంకల్పం
- కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర - పటిష్ట భద్రత నడుమ బయల్దేరిన భక్తులు - స్వరాష్ట్రానికి మృతదేహాలు.. కశ్మీర్లో విపక్షాల బంద్ - మోదీ వైఫల్యం వల్లే ఉగ్రదాడి: వీహెచ్‌పీ సంచలన ఆరోపణ శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర భక్తులపై ఉగ్రవాదులు సోమవారం రాత్రి దాడి చేసి బీభత్సం సృష్టించినా యాత్రీకులు మాత్రం జంకలేదు. తమ పట్టుదల సడలలేదని నిరూపిస్తూ మంగళవారం యథావిధిగా యాత్ర కొనసాగించారు. జమ్మూ నుంచి పలు యాత్రీకుల బృందాలు అమర్నాథ్ ఆలయానికి బయలుదేరాయి. భక్తుల వాహనాలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. కశ్మీర్ పోలీసులు దాడి కేసును విచారిస్తున్నారని, యాత్రకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్ చెప్పారు. అనంతనాగ్‌లో ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఆయన చేరుకుని, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల చర్యకు నిరసనగా విపక్షాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చాయి. కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోరా శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వోరాకు లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్, ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ రాక్షసమూక చర్యను తీవ్రంగా ఖండించాయి. పవిత్ర హిమలింగాన్ని దర్శించుకుని స్వస్థలానికి వెళ్తున్న భక్తులపై సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అమర్నాథ్ యాత్రీకుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందడం తెలిసిందే. మరో 32 మంది యాత్రీకులు గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. అనంతరం ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డా.. వారి యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అక్కడినుంచి వెళ్తున్న యాత్రీకుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మోదీ వైఫల్యం వల్లే : వీహెచ్‌పీ ఈ ఘటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్థతే కారణమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిందించింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోయారని సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా కశ్మీర్ లోయను పూర్తిగా సైన్యానికి అప్పగించాలని, సమర్థుడిని రక్షణమంత్రిగా నియమించాలని తొగాడియా అన్నారు. ‘అమర్నాథ్’ మృతుల వివరాల వెల్లడి దాడిలో మృతి చెందిన ఏడుగురి పేర్లను జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ 32 మందిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు మృతదేహాలను శ్రీనగర్ నుంచి సూరత్‌కు హెలికాప్టర్లో తరలించారు. మరణించిన వారిని హాసుబెన్ రాటిలా పటేల్, సురేఖ బెన్ పటేల్, లక్ష్మీబెన్ ఉషా మోహన్‌లా సొనాకర్, ఠాకూర్ నిర్మలాబెన్, రతన్ జినాభాయ్ పటేల్, ప్రజాపతి చంపాబెన్గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. కశ్మీర్ ప్రభుత్వం రూ.ఆరు లక్షలు, రూ.1.50 లక్షల చొప్పున, అమర్నాథ్ ఆలయ బోర్డు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. బుల్లెట్లు దూసుకొచ్చినా ధైర్యంగా ముందుకు సాగిన డ్రైవర్ అమర్నాథ్ యాత్రీకులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా బస్సు డ్రైవర్ షేక్ గపూర్ దాదాపు కిలోమీటర్ వరకు ముందుకువెళ్లడంతో అతణ్ని అంతా ప్రశంసిస్తున్నారు. ప్రాణనష్టం సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. యాత్రీకుల ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లారని ఉగ్రదాడిలో గాయపడ్డ మహారాష్ట్రకు చెందిన యాత్రీకురాలు భాగ్యమణి తెలిపారు. ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ జమ్మూ ప్రభుత్వంతోపాటు అమర్నాథ్ ఆలయబోర్డు రూ.ఐదు లక్షల చొప్పున నజరానా ప్రకటించాయి. గపూర్ పేరును రాష్ట్రపతి ధీశాలి పురస్కారానికి సిఫార్సు చేస్తామని రూపానీ ప్రకటించారు. కుట్రపన్నింది లష్కరే తోయిబా.. దాడి చేసింది ఇస్మాయిల్ అనంతనాగ్: అమర్నాథ్ యాత్రీకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థేనని కశ్మీర్ రేంజ్ ఐడీ మునీర్‌ఖాన్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారైన ఇస్మాయిల్ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఇస్మాయిల్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఐజీ పేర్కొన్నారు. ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాలి: సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన పవిత్ర అమర్నాథ్ యాత్రలో జరిగిన ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి ముస్లింలకు, కశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మెహబూబా ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీలకు వందనాలు: రాజ్‌నాథ్ ఈ ఘటనపై సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిం చారు. జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు, నిఘా విభాగం, పారా మిలటరీ బలగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ విలేకరులతో మాట్లాడుతూ అమర్నాథ్ భక్తులపై జరి గిన ఉగ్రవాద దాడిని కశ్మీర్‌లోని అన్ని వర్గాలూ ఖండించాయని, అందుకు వారందరికీ వందనం చేస్తున్నానని ఆయన అన్నారు. దాడులకు భయపడం: రాహుల్‌గాంధీ పవిత్ర అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడి ఘటనను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఉగ్రదాడులు భారత్‌ను ఎన్నటికీ భయపెట్టలేవని ఆయన ట్వీట్ చేశారు. ‘అమాయకులైన యాత్రికులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం’ అంటూ రాహుల్ ట్విటర్ వేదికగా సానుభూతి వ్యక్తం చేశారు. కాగా.. భద్రతా లోపాల వల్లే దాడి జరిగిందని కేంద్రంపై విమర్శలు చేశారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించి.. మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వ్యతిరేకంగా నినాదాలు చేస్తే సహించం
-
’బుల్లెట్లు ప్రయోగించి వెళ్లగొట్టండి’
బరేలీ: పాకిస్థాన్ కు వెళ్లిపోవాలనుకున్న వారిని మనదేశం నుంచి పంపించివేయాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) అగ్రనేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఇలాంటి వారు మనదేశం విడిచిపెట్టకపోతే తుపాకులతో కాల్చాలని ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో విలేకరులతో మాట్లాడుతూ... ‘పాకిస్థాన్ కు వెళ్లాలనుకునేవారిని పంపిచేయండి. ఒకవేళ మన దేశం విడిచి వెళ్లేందుకు ఒప్పుకోకపోతే బుల్లెట్లు ప్రయోగించి వీరిని పొరుగు దేశానికి పంపించాల’ని తొగాడియా పేర్కొన్నారు. కశ్మీర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మెతకవైఖరి అవలంభిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. ‘ ప్రసంగాలతో దేశాన్ని కాపాడలేరు. తుపాకీ బుల్లెట్లు ఉపయోగించడం ద్వారానే దేశానికి రక్షించగలమ’ని తొగాడియా అన్నారు. -
'హిందువుల కలను మోదీ గుర్తుంచుకోవాలి'
భోపాల్: అయోధ్యలో రామమందిరం నిర్మాణమే హిందువుల కల అని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలని అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ప్రవీణ్ తొగాడియా అన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత లోకసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గం ఇచ్చిన వాగ్దానం మేరకు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చిన చోటే రామ మందిరం నిర్మాణం చేపడతారని తొగాడియా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనకు నమ్మకం ఉందని.. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని తొగాడియా వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ సోమనాధ్ ఆలయాన్ని నిర్మించినట్లుగానే, లోక్‌సభలో తీర్మానం ద్వారా రామమందిరం నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. రామాలయం నిర్మాణం కోసం హిందువులు ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. -
పుష్కరాల్లో పాల్గొన్న ప్రవీణ్‌తొగాడియా
-
'మోదీ ఆ ఇద్దరినీ పట్టుకొచ్చి ఉరితీయిస్తారు'
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ పర్యటనపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్పందించింది. ఆ సంస్థ ముఖ్యనేత ప్రవీణ్ తొగాడియా ఆదివారం అహ్మదాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది పాకిస్థాన్ వెళుతోన్న మోదీ.. తిరిగొచ్చేటప్పుడు ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్‌లను పట్టుకురావాలని, ఈ గడ్డ మీద వాళ్లను ఉరితీసి 'భారత్ జోలికొస్తే ఎవరికైనా ఇదే శిక్ష' అనే సందేశాన్ని ప్రపంచానికి తెలపాలని అన్నారు. ఈ పనిని మోదీ తప్పకుండా చేస్తారని తాను నమ్ముతున్నట్లు తొగాడియా చెప్పారు. రామ మందిరం నిర్మించాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది అంగీకరించాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను తొగాడియా తొసిపుచ్చారు. మందిరం నిర్మాణం ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుందన్నారు. లవ్ జీహాద్‌ను అరికట్టడంతోపాటు పేద హిందువుల కోసం వీహెచ్‌పీ వినూత్న కార్యక్రమాలతో ముందుకు ముందుకుపోతున్నదన్నారు. తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేయడం ఎలాగో రైతులకు నేర్పించే కార్యక్రమంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేద హిందువులకు నెలకు రూ. 1000 అందజేస్తామన్నారు. -
'బాబుకు విదేశీ పర్యటనలపైనే శ్రద్ధ'
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకి విదేశీ పర్యటనలపై ఉన్నంత శ్రద్ధ... శ్రీకాళహస్తి రాజగోపురం పునర్నిర్మించటంలో లేదని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. తిరుమలో గురువారం కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపుల ప్రవీణ్ తొగాడియా మాట్లాడారు. శ్రీకాళహస్తి రాజగోపురం కుప్పకూలి ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. శ్రీకాళహస్తి రాజగోపురాన్ని వెంటనే నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ప్రవీణ్ తొగాడియాపై కర్ణాటకలో నిషేధం
బెంగళూరు: విశ్వ హిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియాను కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఆ రాష్ట్ర హోం శాఖ శనివారం నిషేధం విధించింది. ఈ నెల 9 నుంచి 13 వరకు ఉడుపిలో జరిగే ఓ కార్యక్రమానికి తొగాడియా ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆయన ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఉడుపి జిల్లా ఎస్పీ అన్నామలై విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. -
ఇద్దర్నే కనాలని చట్టం చేయాలి: తొగాడియా
బరేలీ: దంపతులకు ఇద్దరే సంతానం ఉండేలా చట్టాన్ని చేయాలని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మంగళవారం వ్యాఖ్యానించారు. ‘మైనారిటీల జనాభా పెరుగుతూనే ఉంది. దానిపై మాట్లాడితే వివాదం అవుతుంది. అందుకే ఇద్దరే పిల్లలు ఉండాలని ఒక చట్టం చేస్తే సరిపోతుంది’ అన్నా రు. బరేలీలో జరిగిన వీహెచ్‌పీ 50వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. -
”మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవాలి”
-
వాళ్లందరినీ హిందూ మతంలోకి మారుస్తాం: తొగాడియా
ముస్లింలు, క్రిస్టియన్లు అందరినీ హిందూ మతంలోకి మారుస్తామని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాన్ని తేవాలని, తాము దాన్ని సమర్థిస్తామని ఆయన చెప్పారు. హిందూమతం అనేది ఒక జీవన విధానమని, ప్రతి హిందువు తోటి హిందువు కోసం రోజుకు పిడికెడు బియ్యం, పది రూపాయలు పక్కన పెడితే హిందువులన్నవాళ్లు ఎవరూ పేదలు కారని ఆయన చెప్పారు. ముస్లింల రిజర్వేషన్లను తాము వ్యతిరేకిస్తామని ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు. -
మతం మారినవారిని హిందువులుగా మారుస్తాం:తొగాడియా
హైదరాబాద్: మతం మారినవారిని తిరిగి హిందువులుగా మారుస్తామని విశ్వహిందూపరిషత్(విహెచ్పి) అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చెప్పారు. ఈ రాష్ట్రంలో నిజాం సర్కార్ తేవాలని చూస్తే ప్రతి వ్యక్తి సర్దార్ పటేల్‌గా మారతాడని హెచ్చరించారు. ముస్లింలు, క్రైస్తవులు హిందువుల వారసులేనని అన్నారు. హిందువులు అంతా ఐకమత్యంగా ఉంటే హిందువులలో ఎవరూ పేదరికంలో ఉండరని అన్నారు. దేశంలో హిందూ రాజ్యం వచ్చిందని, ఈ రాష్ట్రంలో కూడా హిందూ రాజ్యం రావాలన్న ఆకాంక్షను తొగాడియా వ్యక్తం చేశారు. -
హిందూ విద్యార్థులకు రిజర్వేషన్ ఎందుకివ్వరు?
కడప: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే రిజర్వేషన్ ను హిందూ విద్యార్థులకు ఎందుకు వర్తింపచేయరని వీహెచ్ పీ అధ్యక్షుడు (విశ్వహిందూ పరిషత్ ) ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు. శుక్రవారం హిందూ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ముస్లింల రిజర్వేషన్ అంశాన్ని ఈ సందర్భంగా లేవనెత్తారు. ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 12 శాతం రిజర్వేషన్ ను హిందువులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. హిందువులు పన్నులు కట్టడం లేదా? అని నిలదీశారు. రామ మందిరం నిర్మాణం జరిగేంతవరకూ హిందువులకు గౌరవం ఉండదని, ఎలాగైనా మందిర నిర్మాణం జరిపి తీరుతామని తొగాడియా పేర్కొన్నారు. -
అండగా ఉంటాం..ఆదుకుంటాం
హిందువుల సంరక్షణే వీహెచ్‌పీ ధ్యేయం ప్రవీణ్ తొగాడియా సంగారెడ్డి క్రైం: పేద హిందువుల సంరక్షణ, సమృద్ధే విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్‌పీ) ధ్యేయమని, దేశంలో పేద హిందువులకు ఆకలి బాధలు లేకుండా చేయడమే లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు డా. ప్రవీణ్ బాయ్ తొగాడియా అన్నారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రభుత్వాలు, అధికారం తమ వద్ద లేకున్నప్పటికీ, నిరుపేద హిందువులను ఆదుకునేందుకు వీహెచ్‌పీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. హిందూ ధర్మంపై క్రిష్టియన్ల దాడి కొనసాగుతోందని, ప్రతి ఒక్క హిందువు దాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే హిందూ ధర్మానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందన్న విషయాన్ని హిందువులంతా గమనించాలన్నారు. కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో నేడు హిందూ ధర్మం క్షీణించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో హిందువులు మచ్చుకైనా కనిపించకుండా పోయారన్నారు. నేడు ప్రేమ వివాహాల పేరిట హిందు యువతులను ముస్లింలు పెళ్లి చేసుకొని వారి మతంలో కలుపుకోవడం బాధిస్తోందన్నారు. ప్రతి ఒక్క హిందువు పిడికెడు బియ్యం ఇచ్చిపేద హిందువులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. దళితులు వంటింట్లోకి వచ్చి భోజనం చేసే విధమైన హిందూ ధర్మ సంఘటిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి పాటు పడాలన్నారు. హిందువులంతా జాగృతమై హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోవాలని కోరారు. హిందూ ధర్మ రక్షణ కోసం సోషల్ మీడియా ద్వారా నిరంతర ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని ఐకమత్యంగా కాపాడాలన్నారు. గోవులను పూజించాలని చెప్పారు. వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ, హిందువులంతా చైతన్యవంతులై హిందూ మతంపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలన్నారు. పశువులను వధించే పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ రక్షణకోసం వీహెచ్‌పీ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. బుదేరాలో రామరథం యాత్రపై క్రైస్తవులు దాడి చేస్తే పోలీసులు వారిని వదిలి హిందువులపై కేసులు పెట్టారని ఆరోపించారు. హిందువులంతా సంఘటితమైతేనే దాడుల నివారించవచ్చన్నారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు పన్యాల ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లాలోని అల్లానా, అల్‌కబీర్ పశువధ ఫ్యాక్టరీలను మూసివేయాలని వీహెచ్‌పీ విస్తృత పోరాటం చేసిందన్నారు. కానీ ఆ పరిశ్రమలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీహెచ్‌పీ నేత ఆకుల రాజయ్య మాట్లాడుతూ, హిందూ సమాజ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలని కోరారు. జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన భూమిని, గోవును పూజించాలన్నారు. దేశ రక్షణలో హిందువులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు కమలానంద భారతి, సంగ్రామ్ మహరాజ్, రాజయోగి వెంకట్‌స్వామి, దేవగిరి మహరాజ్, మఠం రాచయ్య, సిద్దలింగ మహరాజ్, నీటకంఠ స్వామి, బస్వలింగ అవదూత తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నేత మధురనేని సుభాష్‌చందర్, రాందాస్, పురం సంతోష్‌కుమార్, బస్వరాజ్ పాటిల్, సులుగంటి సిద్దేశ్వర్, విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు. భారీ పోలీసు బందోబస్తు విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వీహెచ్ పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా, అధ్యక్షుడు రాఘవరెడ్డిలు హాజరుకావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలను కట్టడి చేశారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతనే సభలోకి అనుమతించారు. సమ్మేళనంలో అన్నదానం విరాట్ హిందూ సమ్మేళనానికి జిల్లా నలుమూలల నుంచి హాజరైన వారికి వీహెచ్‌పీ నేత బిడెకన్నె హన్మంతు అన్నదానం చేశారు. మరోవైపు సంగారెడ్డి పట్టణంలోని క్లాత్ అండ్ రెడీమేడ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వస్త్ర దుకాణాలను బంద్ నిర్వహించారు. సభా ప్రాంగణంలో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే విరాట్ హిందూ సమ్మేళనంలో భాగంగా హోమం కూడా నిర్వహించారు. -
'కేసీఆర్ పాలనలో హిందువులకు అన్యాయం'
-
'కేసీఆర్ పాలనలో హిందువులకు అన్యాయం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో హిందువులకు అన్యాయం జరుగుతోందని వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఆయన గురువారం శంషాబాద్‌లో వీహెచ్‌పీ భాగ్యనగర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లతో ముస్లింలకు లాభం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిజాం పాలనలా ఇప్పుడు తెలంగాణ ఉందని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేవలం ముస్లింలకే అవకాశాలు కల్పిస్తున్నారని, వెనుకబడిన హిందువుల కుటుంబాలకు అవకాశాలు లేవని ఆయన అన్నారు. నాడు నిజాం పాలనపై ఏవిధంగా పోరాటాలు చేశామో...ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలు చేశారు. హజ్ యాత్రలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం హిందువులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. హిందువులను మక్కాకు రానీయరని, తిరుపతిలో అన్యమత ప్రచారం ఎలా చేస్తారని ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు. 'రామసేతువును కూల్చలేరు..కూల్చరు. కూల్చకుండా అడ్డుకుంటామని' ఆయన అన్నారు. కాగా తొగాడియా సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కర్నూలు, కడపలో పర్యటించనున్నారు. శుక్రవారం ఆయన బెంగళూరు వెళతారు. -
రామాలయ నిర్మాణమే లక్ష్యం: తొగాడియా
సాక్షి, బెంగళూరు: అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు. ఇందు కోసం అవసరమైతే చట్టసభల్లోనూ పోరాటానికి వెనుకాడబోమని తేల్చి చెప్పారు. హూబ్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 21 నుంచి మూడు రోజులపాటు దేశంలోని నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. -
రాజకీయ ఎజెండా లేదు
వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా హిందువుల మనోభావాల రక్షణకు కృషి చేసే వారి వెంట ఉంటాం నాగపూర్: విశ్వ హిందూ పరి షత్ (వీహెచ్‌పీ)కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని ఆ సంస్థ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. తాము ఏ పార్టీకి గానీ, వ్యక్తికి గానీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన నాగపూర్‌లో మంగళవారం విలేకరులకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల కోసం నిస్వార్ధ సేవ చేయాలనుకునేవారికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘వీహెచ్‌పీకి ఎలాంటి రాజకీయ ఏజెండా లేదు. సంస్థ ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. అయితే లక్షలాది మంది హిందువుల మనోభావాల రక్షణకు కృషి చేసేవారి వెంట ఉంటామ’ని ఆయన స్పష్టం చేశారు. రామాలయం, ఉమ్మడి పౌర స్మృతి, అర్టికల్ 370, గో వధ తదితర అంశాలను పార్టీలు మరిచిపోతున్నాయన్నారు. అయితే ప్రజాప్రతినిథులను ఎన్నుకునే ముందు గతంలో వారి ప్రదర్శన ఎలాగుంది, వారి పార్టీ పనితీరు ఎలా ఉంది తదితర పరిశీలించాకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. రూ.700 కోట్లతో మైనారిటీ అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేస్తూ యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అత్యధిక జనాభా ఉన్న హిందువులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటి పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. లక్షలాది మంది హిందువులు పేదరిక జీవనస్థాయిలోనే ఉంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చదువుల కోసం ఆర్థిక సహకారం కావాల్సిన హిందూ విద్యార్థుల్లో పేదవాళ్లు లేరా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒకప్పుడు వీహెచ్‌పీ నేతేనని, ఆయన ఆలోచనలను పార్టీ నుంచి వేరు చేయలేం కదా అని విలేకరుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా, పేద రోగుల కోసం లంచ్ ఇండియా హెల్త్‌లైన్ (ఐహెచ్ఎల్)ను నాగపూర్‌లో తొగాడియా ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్క ఫోన్‌కాల్‌తో పేద హిందువులకు ఉచిత ఆరోగ్య సేవలందించేందుకు ఐహెచ్ఎల్ను ప్రారంభించామన్నారు. రోగముందని తెలిసినా డబ్బులు లేక అనేక మంది ఆస్పత్రులు వెళ్లడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. పుణే, ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లోనూ త్వరలోనే ఐహెచ్ఎల్ సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు.