'మోదీ ఆ ఇద్దరినీ పట్టుకొచ్చి ఉరితీయిస్తారు'
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ పర్యటనపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) స్పందించింది. ఆ సంస్థ ముఖ్యనేత ప్రవీణ్ తొగాడియా ఆదివారం అహ్మదాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది పాకిస్థాన్ వెళుతోన్న మోదీ.. తిరిగొచ్చేటప్పుడు ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్లను పట్టుకురావాలని, ఈ గడ్డ మీద వాళ్లను ఉరితీసి 'భారత్ జోలికొస్తే ఎవరికైనా ఇదే శిక్ష' అనే సందేశాన్ని ప్రపంచానికి తెలపాలని అన్నారు. ఈ పనిని మోదీ తప్పకుండా చేస్తారని తాను నమ్ముతున్నట్లు తొగాడియా చెప్పారు.
రామ మందిరం నిర్మించాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది అంగీకరించాలన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను తొగాడియా తొసిపుచ్చారు. మందిరం నిర్మాణం ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుందన్నారు. లవ్ జీహాద్ను అరికట్టడంతోపాటు పేద హిందువుల కోసం వీహెచ్పీ వినూత్న కార్యక్రమాలతో ముందుకు ముందుకుపోతున్నదన్నారు. తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేయడం ఎలాగో రైతులకు నేర్పించే కార్యక్రమంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేద హిందువులకు నెలకు రూ. 1000 అందజేస్తామన్నారు.