
మతప్రాతిపదికన రిజర్వేషన్లను అడ్డుకోవాలి
వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియా
హైదరాబాద్: రాజ్యాంగ నిబంధనలకు విరు ద్ధంగా మత ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రిజర్వేషన్లను అడ్డుకోవాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ తొగా డియా పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని పటేల్ ఘన్‌శ్యామ్ భవన్‌లో రెండోరోజు జరిగిన బజరంగ్‌దళ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మతప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించడం అనైతికమని, ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఓట్ల కోసం సమాజాన్ని చీల్చడం దేశ ద్రోహమన్నారు. సంక్షేమ చట్టాలు ప్రజల మధ్య చిచ్చు పెట్టేవిగా ఉండొద్దని అన్నారు. హజ్ యాత్ర పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రాలైన మానస సరో వరం, తిరుమల తిరుపతి దేవస్థానం, వారణాసికి వెళ్లే భక్తులకు ఎంత సబ్సిడీ ఇస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి, బతుకమ్మ, బోనాలకు డీజేలను అనుమతిం చకపోవడం, హిందువుల పండు గలకు ఆంక్షలు విధించడం, ముస్లింల పండుగలకు అన్ని విధాలుగా సహకరించడాన్ని బట్టి రాష్ట్రంలో హిందూవ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని స్పష్టమవుతోందని అన్నారు. హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని, హిందూ వ్యతిరేక చర్యలను ఖండించి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని, అప్పుడే ప్రతి హిందువుకు మానసిక ధైర్యం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠినంగా గో రక్షణ చట్టాలను అమలు చేయాలని సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను విడిపించుకోవడం, కశ్మీర్‌లో అల్లర్లను చల్లార్చడం, చైనా దురాక్రమణలను అడ్డుకోవడం, చైనా వస్తువులను నిషేధించడం, గో సంరక్షణ చేపట్టాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో బజరంగ్‌దళ్ అఖిల భారతీయ సంయోజక్ మనోజ్‌శర్మ, సోలంకి సోనాల్, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, ఉపాధ్యక్షుడు సుభాశ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.