వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్
ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా
హిందువుల మనోభావాల రక్షణకు
కృషి చేసే వారి వెంట ఉంటాం
నాగపూర్: విశ్వ హిందూ పరి షత్ (వీహెచ్‌పీ)కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని ఆ సంస్థ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. తాము ఏ పార్టీకి గానీ, వ్యక్తికి గానీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన నాగపూర్‌లో మంగళవారం విలేకరులకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల కోసం నిస్వార్ధ సేవ చేయాలనుకునేవారికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘వీహెచ్‌పీకి ఎలాంటి రాజకీయ ఏజెండా లేదు. సంస్థ ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. అయితే లక్షలాది మంది హిందువుల మనోభావాల రక్షణకు కృషి చేసేవారి వెంట ఉంటామ’ని ఆయన స్పష్టం చేశారు.
రామాలయం, ఉమ్మడి పౌర స్మృతి, అర్టికల్ 370, గో వధ తదితర అంశాలను పార్టీలు మరిచిపోతున్నాయన్నారు. అయితే ప్రజాప్రతినిథులను ఎన్నుకునే ముందు గతంలో వారి ప్రదర్శన ఎలాగుంది, వారి పార్టీ పనితీరు ఎలా ఉంది తదితర
పరిశీలించాకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. రూ.700 కోట్లతో మైనారిటీ అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేస్తూ యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అత్యధిక జనాభా ఉన్న హిందువులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటి పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. లక్షలాది మంది హిందువులు పేదరిక జీవనస్థాయిలోనే ఉంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చదువుల కోసం ఆర్థిక సహకారం కావాల్సిన హిందూ విద్యార్థుల్లో పేదవాళ్లు లేరా అని ప్రశ్నించారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒకప్పుడు వీహెచ్‌పీ నేతేనని, ఆయన ఆలోచనలను పార్టీ నుంచి వేరు చేయలేం కదా అని విలేకరుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా, పేద రోగుల కోసం లంచ్ ఇండియా హెల్త్‌లైన్ (ఐహెచ్‌ఎల్)ను నాగపూర్‌లో తొగాడియా ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్క ఫోన్‌కాల్‌తో పేద హిందువులకు ఉచిత ఆరోగ్య సేవలందించేందుకు ఐహెచ్‌ఎల్‌ను ప్రారంభించామన్నారు. రోగముందని తెలిసినా డబ్బులు లేక అనేక మంది ఆస్పత్రులు వెళ్లడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. పుణే, ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లోనూ త్వరలోనే ఐహెచ్‌ఎల్ సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు.
రాజకీయ ఎజెండా లేదు
Published Tue, Feb 25 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement
Advertisement