బజరంగ్ దళ్ మరోమారు చర్చల్లోకి వచ్చింది. హరియాణాలోని నూహ్(మేవాత్)లో జరిగిన హింసాకాండ నిందితుడు బిట్టూ బజరంగీ, ఉరఫ్ రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను బజరంగ్‌దళ్ నేతనని స్వయంగా బిట్టూ ప్రకటించుకున్నాడు. అయితే విశ్వహిందూ పరిషత్ బిట్టూకు, బజరంగ్‌దళ్‌కు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. కాగా బజరంగ్ దళ్‌పేరు చర్చల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. బజరంగ్ దళ్ ఎలా ఏర్పాటయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.
‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అనంతరం
అది జూలై 1984..‘ఆపరేషన్ బ్లూ స్టార్’ ముగిసి నెల రోజులు పూర్తయింది. అయినా పంజాబ్‌లో హిందువులపై తరచూ హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతలో అయోధ్యలోని రామజన్మభూమికి విముక్తి కల్పించేందుకు విశ్వహిందూ పరిషత్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గోరఖ్‌నాథ్ మఠం అధిపతి మహంత్ వైద్యనాథ్ నేతృత్వం వహించగా, కాంగ్రెస్ నేత దౌ దయాల్ ఖన్నా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1984 సెప్టెంబరులో ఈ కమిటీ బీహార్‌లోని సీతామర్హి నుండి అయోధ్య వరకు 400 కిలోమీటర్ల యాత్రను ప్రారంభించింది.
సరయూ ఒడ్డున భారీ కార్యక్రమం
యాత్రలో ఊరేగింపునకు ముందు ఒక ట్రక్కులో రాముడు, సీత విగ్రహాలు ఏర్పాటు చేశారు. వెనుకనున్న వాహనాల్లో సాధువులు, వేలాది మంది ప్రజలు ఉన్నారు. 1984, అక్టోబర్ 6న యాత్ర అయోధ్యలోని సరయూ నదిపైగల వంతెన వద్ద ముగిసింది. అక్టోబరు 7న సరయూ ఒడ్డున ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది పాల్గొన్నారని సీనియర్ జర్నలిస్ట్ వినయ్ సీతాపతి తన పుస్తకంలో రాశారు.
రామజన్మ భూమి కోసం పాటుపడేవారికే ఓటు
ఆరోజు జరిగిన కార్యక్రమంలో వేదికపై ఒక పెద్ద చిత్రం ఏర్పాటు చేశారు. అందులో నిరాయుధ సాధువుల ఎదుట కత్తులు పట్టుకున్న ముస్లింలు నిలబడి ఉన్నట్లు చూపించారు. ఆ కార్యక్రమానికి హాజరైనవారు జాతీయ సమైక్యత, సమగ్రత కోసం ముస్లింలు ఈ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎలాంటి గందరగోళం ఏర్పడకూడదని అటల్ బిహారీ వాజ్‌పేయి అభ్యర్థించారని సీతాపతి తన పుస్తకంలో రాశారు. ఈ భూమిని, మిగిలిన రెండు పవిత్ర స్థలాలను (కాశీ, మధుర) విముక్తి చేయడానికి ఎవరు ప్రయత్నించినా వచ్చే ఎన్నికల్లో హిందువులు వారికే ఓటు వేయాలని కార్యక్రమంలో తీర్మానించారు.
వానరసేన స్ఫూర్తిగా బజరంగ్ దళ్
1984, అక్టోబర్ 8న విశ్వహిందూ పరిషత్ వానరసేన స్ఫూర్తిగా బజరంగ్ దళ్ ఏర్పాటును ప్రకటించింది. వానరసేన సీతామాతను రక్షించడంలో రామునికి సహాయపడింది. బజరంగ్ దళ్ ఉద్దేశ్యం బాబ్రీ మసీదు నుండి రామ జన్మభూమిని కాపాడటం. ఆ తరువాత కొన్నేళ్లకు రామజన్మభూమి ఉద్యమానికి బజరంగ్ దళ్ ప్రధాన భూమికగా మారింది. 1992 డిసెంబరు 6న భజరంగ్ దళ్ నేతృత్వంలో కరసేవకులు అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత బజరంగ్‌దళ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది.
వీహెచ్‌పీ వెబ్‌సైట్‌లో..
విశ్వహిందూ పరిషత్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం బజరంగ్ దళ్ ఎవరిపైననో నిరసన వ్యక్తం చేసేందుకు ఆవిర్భవించలేదు. హిందువులను సవాలు చేసే సంఘ వ్యతిరేక శక్తుల నుండి రక్షణకే ఏర్పాటయ్యింది. ఆ సమయంలో శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో చురుకుగా పాల్గొనే స్థానిక యువకులకే బజరంగ్ దళ్ బాధ్యతలు అప్పగించారు. తరువాతి కాలంలో దేశం నలుమూలల నుంచి యువకులు ఈ సంస్థలో చేరారు. 1993లో తొలిసారిగా బజరంగ్ దళ్ అఖిల-భారత సంస్థాగత రూపం నిర్ణయించారు. అన్ని రాష్ట్రాలలో బజరంగ్ దళ్ శాఖలు ఏర్పాటయ్యాయి.
ఇది కూడా చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Comments
Please login to add a commentAdd a comment