పటిష్ట భద్రత నడుమ కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర
- కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర
- పటిష్ట భద్రత నడుమ బయల్దేరిన భక్తులు
- స్వరాష్ట్రానికి మృతదేహాలు.. కశ్మీర్‌లో విపక్షాల బంద్
- మోదీ వైఫల్యం వల్లే ఉగ్రదాడి: వీహెచ్‌పీ సంచలన ఆరోపణ
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర భక్తులపై ఉగ్రవాదులు సోమవారం రాత్రి దాడి చేసి బీభత్సం సృష్టించినా యాత్రీకులు మాత్రం జంకలేదు. తమ పట్టుదల సడలలేదని నిరూపిస్తూ మంగళవారం యథావిధిగా యాత్ర కొనసాగించారు. జమ్మూ నుంచి పలు యాత్రీకుల బృందాలు అమర్‌నాథ్ ఆలయానికి బయలుదేరాయి. భక్తుల వాహనాలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.
కశ్మీర్ పోలీసులు దాడి కేసును విచారిస్తున్నారని, యాత్రకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్‌పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్ చెప్పారు. అనంతనాగ్‌లో ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఆయన చేరుకుని, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల చర్యకు నిరసనగా విపక్షాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చాయి. కశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోరా శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వోరాకు లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్, ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ రాక్షసమూక చర్యను తీవ్రంగా ఖండించాయి.
పవిత్ర హిమలింగాన్ని దర్శించుకుని స్వస్థలానికి వెళ్తున్న భక్తులపై సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అమర్‌నాథ్ యాత్రీకుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందడం తెలిసిందే. మరో 32 మంది యాత్రీకులు గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. అనంతరం ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డా.. వారి యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అక్కడినుంచి వెళ్తున్న యాత్రీకుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.
మోదీ వైఫల్యం వల్లే : వీహెచ్‌పీ
ఈ ఘటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్థతే కారణమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిందించింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోయారని సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా కశ్మీర్ లోయను పూర్తిగా సైన్యానికి అప్పగించాలని, సమర్థుడిని రక్షణమంత్రిగా నియమించాలని తొగాడియా అన్నారు.
‘అమర్‌నాథ్’ మృతుల వివరాల వెల్లడి
దాడిలో మృతి చెందిన ఏడుగురి పేర్లను జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ 32 మందిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు మృతదేహాలను శ్రీనగర్ నుంచి సూరత్‌కు హెలికాప్టర్‌లో తరలించారు. మరణించిన వారిని హాసుబెన్ రాటిలా పటేల్, సురేఖ బెన్ పటేల్, లక్ష్మీబెన్ ఉషా మోహన్‌లా సొనాకర్, ఠాకూర్ నిర్మలాబెన్, రతన్ జినాభాయ్ పటేల్, ప్రజాపతి చంపాబెన్‌గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. కశ్మీర్ ప్రభుత్వం రూ.ఆరు లక్షలు, రూ.1.50 లక్షల చొప్పున, అమర్‌నాథ్ ఆలయ బోర్డు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
బుల్లెట్లు దూసుకొచ్చినా ధైర్యంగా ముందుకు సాగిన డ్రైవర్
అమర్‌నాథ్ యాత్రీకులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా బస్సు డ్రైవర్ షేక్ గపూర్ దాదాపు కిలోమీటర్ వరకు ముందుకువెళ్లడంతో అతణ్ని అంతా ప్రశంసిస్తున్నారు. ప్రాణనష్టం సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. యాత్రీకుల ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లారని ఉగ్రదాడిలో గాయపడ్డ మహారాష్ట్రకు చెందిన యాత్రీకురాలు భాగ్యమణి తెలిపారు. ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ జమ్మూ ప్రభుత్వంతోపాటు అమర్‌నాథ్ ఆలయబోర్డు రూ.ఐదు లక్షల చొప్పున నజరానా ప్రకటించాయి. గపూర్ పేరును రాష్ట్రపతి ధీశాలి పురస్కారానికి సిఫార్సు చేస్తామని రూపానీ ప్రకటించారు.
కుట్రపన్నింది లష్కరే తోయిబా.. దాడి చేసింది ఇస్మాయిల్
అనంతనాగ్: అమర్నాథ్ యాత్రీకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థేనని కశ్మీర్ రేంజ్ ఐడీ మునీర్‌ఖాన్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారైన ఇస్మాయిల్ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఇస్మాయిల్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఐజీ పేర్కొన్నారు.
ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాలి: సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన
పవిత్ర అమర్నాథ్ యాత్రలో జరిగిన ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి ముస్లింలకు, కశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మెహబూబా ఆవేదన వ్యక్తం చేశారు.
కశ్మీరీలకు వందనాలు: రాజ్‌నాథ్
ఈ ఘటనపై సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిం చారు. జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు, నిఘా విభాగం, పారా మిలటరీ బలగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ విలేకరులతో మాట్లాడుతూ అమర్‌నాథ్ భక్తులపై జరి గిన ఉగ్రవాద దాడిని కశ్మీర్‌లోని అన్ని వర్గాలూ ఖండించాయని, అందుకు వారందరికీ వందనం చేస్తున్నానని ఆయన అన్నారు.
దాడులకు భయపడం: రాహుల్‌గాంధీ
పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడి ఘటనను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఉగ్రదాడులు భారత్‌ను ఎన్నటికీ భయపెట్టలేవని ఆయన ట్వీట్ చేశారు. ‘అమాయకులైన యాత్రికులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం’ అంటూ రాహుల్ ట్విటర్ వేదికగా సానుభూతి వ్యక్తం చేశారు. కాగా.. భద్రతా లోపాల వల్లే దాడి జరిగిందని కేంద్రంపై విమర్శలు చేశారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించి.. మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.