'కేసీఆర్ పాలనలో హిందువులకు అన్యాయం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో హిందువులకు అన్యాయం జరుగుతోందని వీహెచ్పీ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఆయన గురువారం శంషాబాద్లో వీహెచ్పీ భాగ్యనగర్ వెబ్సైట్ను ప్రారంభించారు అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లతో ముస్లింలకు లాభం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిజాం పాలనలా ఇప్పుడు తెలంగాణ ఉందని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కేవలం ముస్లింలకే అవకాశాలు కల్పిస్తున్నారని, వెనుకబడిన హిందువుల కుటుంబాలకు అవకాశాలు లేవని ఆయన అన్నారు. నాడు నిజాం పాలనపై ఏవిధంగా పోరాటాలు చేశామో...ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యలు చేశారు. హజ్ యాత్రలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం హిందువులను పట్టించుకోవటం లేదని విమర్శించారు.
హిందువులను మక్కాకు రానీయరని, తిరుపతిలో అన్యమత ప్రచారం ఎలా చేస్తారని ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు. 'రామసేతువును కూల్చలేరు..కూల్చరు. కూల్చకుండా అడ్డుకుంటామని' ఆయన అన్నారు. కాగా తొగాడియా సంగారెడ్డి, మహబూబ్నగర్, కర్నూలు, కడపలో పర్యటించనున్నారు. శుక్రవారం ఆయన బెంగళూరు వెళతారు.