ఎస్సారెస్పీలో రొయ్యలు
బాల్కొండ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్‌లో జోరుగా రొయ్యల వేట సాగుతోంది. గతంలో ఎన్నడూ ప్రాజెక్టులో ఈ స్థాయిలో రొయ్యల వేట సాగలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఎస్సారెస్పీలో రొయ్యలు లభించేవి కావు. గత ఏడాది నుంచి ఎస్సారెస్పీలో రొయ్యల వేట షురువైంది. వారం రోజుల నుంచి భారీగా రొయ్యలు లభ్యమవుతున్నాయని మత్స్యకారులు తెలిపారు.
గతేడాది ఎస్సారెస్పీలో పెద్ద మొత్తంలో చేపలు మత్యువాత పడ్డాయి. అందుకు ప్రధాన కారణం రొయ్యల విత్తనం పోయడమేనని మత్స్యకారులు చెబుతున్నారు. రొయ్యలకు, చేపలకు వైరం ఉంటుంది. రొయ్య గోళ్లతో గీరడం, కన్నుల్లో పొడవడంతో చేపలు నీటి లోపల ఉండకుండా పైకి వచ్చి ఎండ వేడిమి తట్టుకోలేక అధికంగా మృతి చెందాయని మత్స్యకారులు తెలిపారు.
ఈ ఏడాది జాలర్లకు ప్రాజెక్టులో చేపల కంటే రొయ్యలే అధికంగా లభ్య మవుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఒకింత సంతోష పడుతున్నా రొయ్యల ఉనికితో ప్రాజెక్టులో చేపలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడివి రొయ్యలు..
మూడేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ ఎస్సారెస్పీలో ఎడమ వైపు రొయ్యల విత్తనాన్ని వదిలాడు. తర్వాత రిజర్వాయర్‌లో రొయ్యల పెంపకం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని గ్రహించి, వాటిని అలానే వదిలేసి వెళ్లాడని మత్స్యకారులు అంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఎగుమతి చేయడం ఖర్చు ఎక్కువగా అవుతుందని భావించి ప్రయోగాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. అదే విత్తనం రెండేళ్ల నుంచి రొయ్య ఉత్పత్తులను ఇస్తోంది.
నెల మాత్రమే..
మార్కెట్‌లో రొయ్య ధర కిలో రూ. 400 పలుకుతుంది. ఎస్సారెస్పీ డ్యాం పై దళారులు మత్స్యకారుల నుంచి కిలోకు రూ.170 నుంచి రూ. 200 వరకు కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి రోజు ఓ మత్స్యకారుడు కనీసం 5 నుంచి 6 కిలోల రొయ్యలను పడతాడు. దీంతో మత్స్యకారులకు ఆదాయం వస్తున్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల పెంపకం సరైంది కాదని అంటున్నారు.
రొయ్యలు జూన్ నెలాఖరు నుంచి జూలై నెలాఖరు వరకే దొరుకుతాయని, రొయ్యల పెంపకం వలన ఏడాది పాటు ఆదాయాన్ని ఇచ్చే చేపలు లేకుండా పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
చేపలు లేకుండా పోతున్నాయి..
ఎస్సారెస్పీలో రెండేళ్ల నుంచి రొయ్యలు దొరుకుతున్నాయి. కానీ రొయ్యల వల్ల డ్యాంలో చేపలు లేకుండా పోతున్నాయి. రొయ్య కు, చేపలకు కుదరదు. రొయ్య చేపను తన గోళ్ల తో గీరుతుంది. దీంతో చేపలు చనిపోతున్నాయి. ఎస్సారెస్పీలో రొయ్యల పెంపకం చేపట్టవద్దు. – హన్మండ్లు, మత్స్యకారుడు
కొన్ని రోజులే ఉంటుంది..
ఎస్సారెస్పీలో రొయ్యలు నెల రోజులు మాత్రమే దొరుకుతాయి. తరువాత బ్యాక్ వాటర్ నిలిచే ముళ్ల పొదల్లోకి పోతాయి. చేపలు ఏడాది పొడవునా వేటాడుకుంటాం. రొయ్యల వల్ల చేపలు లేకుండా పోతున్నాయి. ఏడాది పొడవునాపొట్ట నింపే చేపల పెంపకమే మంచిది. – సుధాకర్, మత్స్యకారుడు
Comments
Please login to add a commentAdd a comment