నిజామాబాద్ రూరల్ మండలం కాలూరు గ్రామానికి చెందిన సావిత్రి (పేరు మార్చాం) గత ఏడాది నవంబర్‌లో డెలివరీ అయింది. ఇప్పటి వరకు ఆమెకు అందవల్సిన నగదు ప్రోత్సాహకం అందలేదు. నగదు ప్రోత్సాహకానికి సంబంధించి అన్ని వివరాలు స్థానిక ఆశవర్కర్ ద్వారా నమోదు చేసుకుంది. అయినా ఫలితం లేదు. ఇది ఒక కాలూరు మహిళకు సంబంధించింది సమస్య కాదు.. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది నగదు ప్రోత్సాహకం అందక ఎదురుచూస్తున్నారు.
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో ప్రతి నెలా సుమారు 1100 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గర్భిణులకు, బాలింతలకు కేసీఆర్ కిట్ కింద ప్రోత్సాహకాలు అందించవల్సి ఉంటుంది. మహిళ గర్భం దాల్చిన వెంటనే స్థానిక ఆశ ఏఎన్‌ఎం ద్వారా పేరు నమోదు చేసుకొని రూ. 3000 చొప్పున మొదటిసారిగా పొందుతారు. రెండవ విడత ప్రభుత్వ ఆస్పతిలో ప్రసవం అయితే ఆడపిల్లలకు రూ.5000, మగపిల్లవాడు పుడితే రూ.4000 అందిస్తారు. మూడవ విడత పిల్లలకు స్థానిక ఏఎన్‌ఎం వద్ద టీకాలు ఇప్పిస్తే రూ.2000 అందిస్తారు. చివరి విడత 4వ విడతలో పిల్లలకు జెఈ, మిస్సల్స్ వాక్సిన్ ఇస్తే రూ.3000 అందిస్తారు.
ఇలా నగదు ప్రోత్సాహకం విడతలు వారీగా అందించవల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతం 6 వేల మంది గర్భిణులు వివిధ దశలలో నగదు ప్రోత్సాహకానికి స్థానిక ఏఎన్‌ఎం వద్ద పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం 2 కోట్ల 44 లక్షల రూపాయలు అందించవల్సి ఉంది. గత నాలుగు నెలలుగా ఈ నగదు ప్రోత్సాహకం అందడం లేదు. సుఖమైన ప్రసవం, పేద , మధ్యతరగతి వారికి డెలవరీ సక్రమంగా జరగడం, మాతృ శిశుమరణాలు తగ్గించడానికి నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఇప్పటి వరకు నగదు ప్రోత్సాహకం సక్రమంగా అందడం లేదు. జిల్లాలోని 32 పీహెచ్‌సీల పరిధిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఆలస్యం ఎందుకంటే..
గతంలో కేసీఆర్ కిట్ నగదు ప్రోత్సాహకాలకు సంబంధించి ఆశ, ఏఎన్‌ఎంలు టీఎస్ ఆన్‌లైన్ ద్వారా వీరి వివరాలు నమోదు చేయగానే హైదరాబాద్ నుంచి వీరికి అందవల్సిన ప్రోత్సాహకం వారి బ్యాంకు ఖాతాలో నేరుగా వేసేవారు. గత నాలుగు నెలల నుంచి టీఎస్ ఆన్‌లైన్ బదులు టీసీఎస్ సంస్థకు ఈ పక్రియను అప్పగించారు. కొన్ని నమోదు పద్ధతులను మార్చడం వల్ల గతంలో నమోదు అయిన పేర్లను గుర్తించకలేకపోవడంతో ఈ పక్రియ ఆలస్యమై నగదు ప్రోత్సాహకం అందడం లేదు. ఈ ప్రక్రియ ప్రస్తుతం సరిచేసే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు.
నమోదులో అనేక ఆటంకాలు...
నగదు ప్రోత్సాహకానికి సంబంధించి గర్భిణుల వివరాల నమోదులో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిబంధనల ప్రకారం గర్భం దాల్చిన మహిళ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు హెల్త్‌చెకప్‌లు చేయించుకోవాలి. అనంతరం ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు గర్భిణుల పేర్లను నమోదు చేస్తారు. ఈ విధానంలో కొందరు హెల్త్‌చెకప్ చేయించుకోకుండా పేర్లను నమోదు చేయించుకోవడం, మరోవైపు గర్భిణులు రెండు నెలల తరువాత , మూడు నెలలకుపైబడి పేర్ల నమోదుకు రావడం జరుగుతోంది. దీని వల్ల పేర్లు నమోదు కాకుండా నగదు ప్రోత్సాహకం అందుకోలేకపోతున్నారు. మరోవైపు బ్యాంకు ఖాతాలను ఇవ్వకపోవడం, ఆధార్‌కార్డులను సమర్పించకపోవడం ప్రధాన కారణం. వైద్యసిబ్బంది పదేపదే చెప్పినా ధ్రువపత్రాలు సమర్పించడంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీరా ప్రసవం అయిన తరువాత డబ్బులు అందడం లేదని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా కొనసాగుతున్నాయి.
త్వరలో అందిస్తాం....
పెండింగ్‌లో ఉన్న నగదు ప్రోత్సాహకాలు త్వరలో అందుతాయి. గర్భిణులు నిబంధనల ప్రకారం పక్కా సమాచారం నమోదు చేస్తే తప్పకుండా నగదు ప్రోత్సాహకం హైదరాబాద్ నుంచి వారి ఖాతాలో జమచేస్తారు. ఏమైన పొరపాట్లు ఉంటే నగదు ప్రోత్సాహకం అందించడం కష్టం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతోంది.
– డా.సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment