ఆసుపత్రి ఆవరణలో రోదిస్తున్న కుటుంబసభ్యులు (ఇన్‌సెట్లో) స్వరూప మృతదేహం
సాక్షి, కరీంనగర్ : అమ్మా.. అనే పిలుపు కోసం పురిటినొప్పులను పంటిబిగువున భరిస్తుంది తల్లి. బిడ్డలకు జన్మనివ్వడం అంటే మృత్యువును ముద్దాడి రావడమే..! పిల్లలకు జన్మనిచ్చి అమ్మా అని పిలిపించుకున్నప్పుడే జన్మ సార్థకమైందని మహిళలు భావిస్తారు. పెళ్లయిన పదమూడేళ్లకు గర్భం దాలిస్తే.. అమ్మా అనే పిలుపు కోసం ఆమె పడే ఆరాటం అంతా ఇంతా కాదు. కానీ ఆ మహిళను ఎనిమిది నెలలకే విధి చిన్నచూపు చూసింది. పిల్లలకు జన్మనివ్వకుండానే.. అమ్మా అని పిలిపించుకోకుండానే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన హుజూరాబాద్‌లో గురువారం విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
(ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత )
సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన జూపాక స్వరూప(35)కు చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన కనుకయ్యతో 13 ఏళ్ల కిత్ర వివాహం జరిగింది. సంతానం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగి రూ.లక్షలు ఖర్చు చేసుకున్నారు. చివరగా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా స్వరూప గర్భం దాల్చింది. దీంతో తల్లి కావాలనే కోరిక నెరవేరబోతోందని స్వరూప ఎంతో సంబరపడింది. పదమూడేళ్లకు సంతానం కలుగబోతోందని ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషపడ్డారు. గర్భం దాల్చినప్పటి నుంచి స్వరూపను ఆమె భర్త కనుకయ్య, కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. (మళ్లీ గ్యాంగ్‘వార్’)
ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న స్వరూపకు గురువారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హుజూరాబాద్‌లోని ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తున్న క్రమంలోనే మహిళ మృత్యువాతపడింది. కాగా, ‘స్వరూపకు కవల పిల్లలు జన్మిస్తారని వైద్యులు చెప్పారు.. కనీసం పిల్లలనైనా బతికించేలా చూడండి సారూ..’ అంటూ మృతురాలి భర్త వైద్యులను వేడుకోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ‘పెళ్లయిన పదమూడేళ్లకు మా బిడ్డకు సంతానం కలుగుతుందని ఎంతో ఆశపడ్డాం. దేవుడు మాకు అన్యాయం చేశాడు..’ అంటూ స్వరూప కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు పలువురిని కలిచివేసింది. (అమెరికాలో ‘రవి’ కిరణం )
Comments
Please login to add a commentAdd a comment