అమ్మకు అభయం | pregnant women utilise amma vodi vehicles | Sakshi
Sakshi News home page

అమ్మకు అభయం

Published Thu, Feb 1 2018 5:26 PM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM

pregnant women utilise amma vodi vehicles - Sakshi

హుజూర్‌నగర్‌/సూర్యాపేట రూరల్‌ :  మాతా శిశు సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ పథకం కొనసాగుతుండగా గర్భిణులకు మరిన్ని సేవలందిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్య పరిరక్షణకు దోహదపడేందుకు 108 తరహాలో అమ్మఒడి పేరిట 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలు అమ్మకు ఆత్మీయత, బిడ్డకు ప్రేమను పంచనున్నాయి. మొదటి విడతగా జిల్లాకు ఇప్పటికే ఎనిమిది వాహనాలు రాగా నియోజకవర్గానికి రెండు చొప్పున కేటాయించారు. ఇటీవల మంత్రి జగదీశ్‌రెడ్డి చేతులమీదుగా సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఒక్క ఫోన్‌కాల్‌తో..
మారుమూల గ్రామాల నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు సైతం లేని దు స్థితిలో ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారు. తల్లీ బిడ్డలకే కాకుండా గర్భిణులకు వైద్యం అవసరమైతే 102 నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు. ఇంటికి వచ్చి వాహనంలో వైద్యశాలకు తీసుకు వెళ్లి వైద్యపరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఇంటి వద్దకు చేరవేస్తారు. జిల్లాలో గల 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలల పరిధిలో ఏఏ ఆస్పత్రిలో ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతాలకు నూతనంగా వచ్చిన వాహనాలను కేటాయించేందుకు సిద్ధమయ్యారు.

సేవలు ఇలా....

  •      గర్భిణులకు 7వ నెల నుంచి ప్రసవానంతరం పుట్టిన చిన్నారికి మూడు నెలలు వచ్చేంత వరకు సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది.
  •      7వ నెల నుంచి గర్భిణులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా 102 వాహనానికి సమాచారం అందించి సేవలు వినియోగించుకోవచ్చు.
  •      గర్భిణి ఇంటి వద్దకు వచ్చి 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. వైద్యసేవలు అందించిన తర్వాత్ల తిరిగి ఇంటికి చేరుస్తారు.
  •      డెలివరీ అయిన మూడు నెలల వరకు కూడా ఈ 102 వాహనం సేవలు వినియోగించుకోవచ్చు.
  •      102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే తరలిస్తారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించరు.
  •      ప్రయాణం మధ్యలో గర్భిణులు, బాలింతలకు అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే ఎమర్జెన్సీ కిట్‌ అందుబాటులో ఉంచారు. ప్రయాణ సమయంలో వైద్య పరీక్షల అవసరం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ఆడియోను వినిపిస్తారు.

వాహనాల సేవలు వినియోగించుకోవాలి
జిల్లాకు 102 వాహనాలు 8 వచ్చాయి. ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాల్లో గర్భిణులను సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.  – రహీం, ఎమర్జెన్సీ మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ , సూర్యాపేట జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement