
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో జనవరి 31 నుంచి జరగనున్న మేడారం మహాజాతరకు జిల్లా పోలీసు అధికారులు పక డ్బందీ ఏర్పాట్లు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం భూపాలపల్లిలో జిల్లా పోలీసు కార్యాలయ భవనం నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశమై జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
మేడారం జాతరకు కోటికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున..సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రాఫిక్, శాంతిభద్రతల సమ స్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి జాతరను దిగ్విజయం చేయాలన్నారు. ఆయన వెంట కలెక్టర్ ఆకునూరి మురళి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, గ్రే హౌండ్స్ ఐజీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్ సజ్జనార్, వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఉన్నారు.
దేశానికే ఆదర్శంగా నిలుపుతాం
సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ పోలీసు వ్యవస్థను దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టే దిశగా ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో మంగళవారం పర్యటించారు. పోలీసు అధికారులతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేయాలని పోలీసులకు సూచించినట్టు వివరించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఆ దిశగా ముందుకెళుతున్నట్లు వివరించారు. మారుతున్న పరిస్థితుల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. డీజీపీతో పాటు నార్త్‌జోన్ ఐజీపీ నాగిరెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ ఐజీపీ నవీన్‌చంద్, ఐజీ కె.శ్రీనివాసరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, ఎస్‌ఐబీ ఎస్పీ నర్సింగరావు, భద్రాచలం ఏసీపీ సునీల్‌దత్ పాల్గొన్నారు.