రాంనగర్ :రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేసి ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఆర్థిక, వ్యవసాయశాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సకాలంలో పంట రుణాలు పొందిన రైతుల జాబితాను బ్యాంకుల వారీగా, గ్రామాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. రైతుల జాబితా రూపొందించేటప్పుడు పారదర్శకత పాటించాలన్నారు.
ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలని, ప్రభుత్వం జారీ చేసిన నిర్ధిష్టమైన ఫార్మాట్‌లో రైతుల వివరాలు పొందుపర్చాలని చెప్పారు. సేకరించిన రైతుల వివరాలపై మరోమారు సామాజిక తనిఖీ నిర్వహించి ఈ నెలాఖరు లోగా తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. 2014 మార్చి 31 నాటికి బకాయిపడిన పంట రుణాలకు రూ.లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుందని ఆయన వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ చిరంజీవులు, జేసీ ప్రీతి మీనా, వ్యవసాయశాఖ జేడీ నర్సింహ, జిల్లా సహకార అధికారి ప్రసాద్, బ్యాంకుల ఉన్నతాధికారులు, కంట్రోలింగ్ అధికారులు పాల్గొన్నారు.
24లోగా రూపొందించాలి: కలెక్టర్
రైతుల పంట రుణాల మాఫీ విషయంలో ప్రభు త్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు ఈనెల 24 లోగా జాబితాలు సిద్ధం చే యాలని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు కోరారు. బుధవారం తన ఛాంబర్ లో జరిగిన బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో పంట రుణాల మాఫీపై చర్చించారు. ఈనెల 24లోగా బ్యాంకుల వారీగా, గ్రామాల వారీగా జాబితాలు రూపొందించి మరుసటి రోజు నుంచి కంప్యూటరైజేషన్ పూర్తి చేయాలని సూ చించారు. మండల స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి జాబితాలు సిద్ధం చేయాలని, వాటిని తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాబితాపై సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇందులో గ్రామస్తులను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వారి అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం తుది జాబితా సిద్ధం చేస్తామన్నారు. రైతుల జాబితా తయారు చేసేటప్పుడు మండల, గ్రామ స్థాయి వ్యవసాయ అధికారులు, సహకార సిబ్బంది బ్యాంకర్లకు సహకరించాలని ఆదేశించారు. అవసరమైతే ఆదర్శరైతుల సహకారం కూడా తీసుకోవచ్చని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను ఆయా బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లకు పంపాలని కంట్రోలింగ్ అధికారులను కోరారు. సమావేశంలో జేసీ ప్రీతిమీనా, జేడీఏ నర్సింహరావు, జిల్లా సహకార అధికారి ప్రసాద్, వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
రైతుల జాబితా సిద్ధం చేయండి
Published Thu, Aug 21 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement
Advertisement