అంతటా వర్షాభావమే
- చీడ పీడలతో పంటలకు నష్టం
- వాటిపై దృష్టి సారించండి
- కలెక్టర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం
ప్రగతినగర్ : అసలే వర్షాభావ పరిస్థితులు.. ఆపై చీడ పీడలతో పంటలు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులకు ఖరీఫ్ రుణాలు ఎలా రెన్యూవల్ చేస్తున్నారు.. పంటల పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కలిసి వెళ్లి పంటల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండవ విడత రుణ మాఫీలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన రూ.196.57 కోట్లు వ్యవసాయ శాఖ ద్వారా బ్యాంకులకు బదిలీ చేశామని అన్నారు. ఇప్పటికి సుమారు 20 శాతం అంటే రూ. 318 కోట్లు రెన్యూవల్ చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం మరో 12.50 శాతం రుణ మాఫీ విడుదల చేస్తామని, ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని చెప్పారు.
జిల్లాలో సోయూ, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్థసారధి, కమిషనర్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.