రాంనగర్ :మండలస్థాయి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ టి.చిరంజీ వులు ఆదేశించారు. గురువారం స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పంట రుణాల వివరాలను బ్యాంకు అధికారులు ఇప్పటికే అందించారన్నారు. వాటిని గ్రామం వారీగా, కుటుంబం వారీగా పరిశీలించి ప్రతి కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ అయ్యే విధంగా జాబితా రూపొందించి ప్రతి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ఈ నెల 29న గ్రామ సభలు నిర్వహించి లిస్టులు ఫైనల్ చేసి పంపించాలని కలెక్టర్ సూచించారు.
ఒకే రైతు రెండు, మూడు బ్యాంకుల్లో రుణం పొంది ఉన్నట్లైతే వాటిని కన్సాలిడేట్ చేసి ముందు తీసుకున్న అప్పు లేదా ఏది ఎక్కువ అప్పు ఉంటే అందులో నుంచి రూ. లక్ష వరకు మాఫీ అయ్యే విధంగా లిస్టు ఫైనల్ చేయాలన్నారు. రుణమాఫీకి అర్హులైన ఏ ఒక్క రైతు కూడా జాబితాలో మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా రుణమాఫీకి అర్హులు కాని వారి పేర్లు విధిగా తొలగించాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే డాటాను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు కోరారు. కొన్ని చోట్ల డాటాను కంప్యూటరీకరించడంలో వెనుకబడి ఉన్నందున ఆయా ప్రాంతాలలో ఆర్‌డీఓలు చొరవ తీసుకుని వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
డాటా ఎంట్రీల విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఎక్కడైనా హాజరుకాకపోయినట్లైతే వారిని సస్పెండ్ చేయాలని డీపీఓకు ఆయన ఆదేశించారు. మున్సిపల్ ప్రాంతాలలో కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి డాటా ఎంట్రీని వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన భూమికి వెంటనే డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయాలని తహసీల్దార్లకు కోరారు. అతేగాకుండా రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ కూడా ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ప్రీతిమీనా, జేడీఏ నర్సింహారావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన రైతుల జాబితా పంపించాలి
Published Fri, Aug 29 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement