
మహబూబ్‌నగర్ క్రైం: ‘మిమ్మల్ని.. మీ ఇంటిని శని ఆవహించింది.. ప్రత్యేక పూజలు చేస్తే తప్పా ఆ శని పోదు’ అంటూ నమ్మించాదు.. ఇంట్లో ఉన్న బంగారం తెచ్చి ఈ రాగి చెంబులో ఉంచాలని.. పూజల అనంతరం సాయంత్రం తెరిచి చూడాలని చెప్పి చెంబులో ఉన్న బంగారంతో దొంగస్వామి ఉడాయించిన సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ రూరల్ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డకు చెందిన నవనీత, ఆమె పిల్లలు, అత్తతో కలిసి ఇంట్లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి స్వామిజీ వేశంలో వచ్చాడు.
మీ ఇంటికి శని పట్టుకుంది, మీకు అంత మంచిగా చేస్తానని వారికి చెప్పి.. ఓ రాగి చెంబులో నీరు, స్టిల్ టిఫెన్ బాక్స్, అగరబత్తులు, బియ్యం, ఇంట్లో ఉన్న బంగారం తీసుకురావాలని చెప్పాడు. దీంతో అతను చెప్పిన విధంగా అన్ని రకాల సామగ్రితో పాటు మూడు తులాల బంగారం ఇచ్చారు. ఆ తర్వాత అతను పలు రకాల పూజలు చేసి టిఫిన్ బాక్స్‌లో బియ్యంతో పాటు బంగారం పెట్టి..మీ ఇంటి దేవుడిని తలుచుకోవాలని చెప్పాడు. అప్పటికే బంగారం కాజేసిన అతను టిఫిన్ బాక్స్ సాయంత్రం తెరిచి చూడాలని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. వారు సాయంత్రం చూడగా దాంట్లో బంగారం మాయమైంది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment