
యువతకు ప్రాధాన్యం కల్పించాలి
* డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య
* ముగిసిన పాలకమండలి సమావేశం
* రెండో రోజు పలు పథకాల అమలుపై చర్చ
ఏటూరునాగారం : సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో అమలవుతున్న పథకాల్లో ఎక్కువగా యువతకు ప్రధాన్యం కల్పించాలని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సూచిం చారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో 56వ పాలక మండలి సమావేశం ఆదివారం ముగిసింది. రెండో రోజు ఆర్థిక, ఉద్యానవనం, వ్యవసాయం, ఎకనామికల్ సపోర్ట్ స్కీం, మాడాపై ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు చర్చిం చారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, చందూలాల్, శంకర్‌నాయక్, కలెక్టర్ కిషన్, ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావుతోపాటు పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మాడిఫైడ్ ఏరియూ డెవలప్‌మెంట్ అప్రోచ్ (మాడా) కింద ఉన్న 15 మండలాల్లో 68 గ్రామాల గిరిజన నిరుద్యోగుల అభ్యున్నతికి గత ఏడాది రూ.1.70 కోట్లు మంజూర య్యాయి... ఈ పథకం కింద 298 పథకాలు ఉన్నాయి... 2011-12 నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరికీ లబ్ధిచేకూరకపోవడం దౌర్భగ్యమని సభ్యులు ముక్తకంఠంతో అన్నారు. మహబూబాబాద్‌లో మాడా కార్యాలయ భవనం ఏర్పాటు చేసి ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి పథకాలను పర్యవేక్షించాలని సభ్యులు తీర్మానించారు. ‘మాడా’ ఏపీఓ సీతారామయ్య మాడా ద్వారా వచ్చిన పథకాలను వివరించే క్రమంలో.... అసలు ఈ పథకాలు అమలై ఎన్ని రోజులు అవుతుంది... కార్యాలయంలో మాడా కింద దరఖాస్తు చేసుకున్న యూనిట్లు ఎన్ని ఉన్నాయని సభ్యులు ప్రశ్నించడంతో వెంకటేశ్వర్లు నీళ్లు మింగారు. మహబూబాబాద్‌లో ఇందిరానగర్ సమీపంలో ఎకర ంన్నర స్థలం మాడా భవనానికి కేటాయించారని, కమిషనర్ వద్ద భవన నిధుల ఫైల్ ఆగినట్లు సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు.
ఎకనామికల్ సపోర్ట్ స్కీం....
ఎకనామికల్ సపోర్ట్ స్కీంలో 2013 డిసెంబర్ వరకు రూ. 6.60 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో 959 యూనిట్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందాయని సభ్యులకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అవినాష్ తెలిపారు. 2011-12 ఆర్థిక సంవత్సరం నిధులు రూ. 3.40 కోట్లు నిల్వ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై సీతారాంనాయక్ మాట్లాడుతూ గిరిజనుల నుంచి 3,100 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో కేవలం 959 మందికి మాత్రమే ఇచ్చి... మిగతా వారిని కార్యాలయం చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి ఈ ఏడాది మే 20 వరకు అన్ని నిధులను క్లోజ్ చేసి ప్రభుత్వానికి అప్పగించామని, నూతన బడ్జెట్ వస్తే అందులో ఈ దరఖాస్తులకు రుణాల యూనిట్లు మంజూరు చేస్తామన్నారు.
ఉద్యానశాఖ
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న పథకాల్లో పారదర్శకత లేకపోవడంతో గిరిజనులకు ఫలాలు అందడం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన శాఖ ద్వారా నాటిన మొక్కలు బతికున్నాయా లేదా అని సభ్యులు ప్రశ్నించారు. ఇందుకు ప్రాజెక్ట్ హార్టికల్చర్ అధికారి సుధాకర్... గురుకులం, ఆశ్రమ పాఠశాలల్లో రెండు వేల మొక్కలను నాటామని, ఈజీఎస్ కింద ప్రభుత్వ భూముల్లో మామిడి మొక్కలను దళిత, గిరిజన రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. మొక్కలు అన్ని విధాలుగా బాగున్నాయని చెప్పడంతో దొంతి మాధవరెడ్డి ఒక్కసారి పరిశీలిద్దామని అనడంతో... పీహెచ్‌ఓ‘ కాదు సార్.... 50 శాతం మొక్కలు ఉన్నాయి’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఇదేమిటని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయం, ఆర్థికశాఖ...
ఈ ఏడాది సీజన్ మొదలైనా... సబ్సిడీపై విత్తనాలను ఎందుకు సరఫరా చేయలేదని అసిస్టెండ్ డెరైక్టర్ వెంకటేశ్వర్లను సభ్యులు ప్రశ్నించారు. బడ్జెట్ లేక విత్తనాలు సరఫరా చేయలేకపోయూమని ఆయన తెలిపారు. 2007-14 సంవత్సరంలో జరిగిన ఆదాయ, ఖర్చుల వివరాలను సభ్యుల ముందు అధికారులు ప్రవేశపెట్టారు.