సాక్షి, హైదరాబాద్: రవాణా చట్టాలు ఎంతగా అపహాస్యమవుతున్నాయో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇటీవల తేటతెల్లం చేసింది. ఆ రాష్ట్రంలో పర్మిట్లు పొంది తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా వందల సంఖ్యలో బస్సులు తిరుగుతున్న తీరును బయటపెట్టింది. దీంతో ఖంగుతిన్న తెలంగాణ ప్రభుత్వం అలాంటి బస్సులపై కాస్త ఆలస్యంగానైనా కొరడా ఝుళిపించింది. కానీ.. అదంతా తాటాకు చప్పుడేనని తేలిపోయింది. అలాంటి బస్సులపై రెండు, మూడు నెలలు చర్యలు తీసుకున్నట్లు హడావుడి చేసిన రవాణా శాఖ.. ఇప్పుడు గేట్లు బార్లా తెరిచింది. దీంతో అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులతోపాటు పాండిచ్చేరి, కర్ణాటక రిజిస్ట్రేష న్‌తో కొత్త బస్సులు భారీగా పుట్టుకొచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా వందల సంఖ్యలో బస్సులు నిబంధనలను కాలరాస్తూ రవాణా దందా మొదలెట్టాయి.
మళ్లీ బెర్తుల బస్సులు..
అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్మిట్ చార్జీలు తక్కువగా ఉండటంతో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పర్మిట్లు పొంది హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు బస్సులు తిప్పుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బెర్తులు ఏర్పాటు చేసి మరీ ఈ బస్సులు నడిపిస్తున్నారు. తెలంగాణలో బెర్తులకు అనుమతి ఉండదన్న ఉద్దేశంతో కొన్ని బడా ట్రావెల్ కంపెనీలు కర్ణాటక, పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌లో బెర్తులు ఏర్పాటు చేసుకుని తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా దందా మొదలెట్టాయి. అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ బస్సులపై నియంత్రణను రవాణా శాఖ అనధికారికంగా ఎత్తేయడంతో హైదరాబాద్ కేంద్రంగా భారీగా రవాణా దందా మొదలెట్టాయి.
రాత్రి 9 తర్వాత బస్సులే బస్సులు..
కేంద్ర మోటారు వాహనాల చట్టం 125 సి(4) ప్రకారం.. ప్రభుత్వ రవాణా సంస్థలు, రాష్ట్ర, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన రవాణా సంస్థలే స్థానికంగా తిరిగేందుకు బెర్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్, పర్మిట్లు పొంది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల పరిధిలో బస్సులు తిప్పుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరంలో పెద్ద మొత్తంలో వాటి వల్ల ఆదాయం భారీగా పడిపో తోందని వివరించింది. కానీ.. అలాంటి బస్సులు నియంత్రించొద్దని రాజకీయ నేతల నుంచి ఒత్తిడి ఉండటంతో రవాణా ఆ శాఖాధికారులు వాటి వైపు చూడటం లేదు. దీంతో హైదరాబాద్ శివారులోని చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లితో పాటు అమీర్‌పేట, లక్డీకాపూల్‌లో రాత్రి 9 దాటిన తర్వాత వందల సంఖ్యలో బస్సులు ప్రత్యక్షమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment