- లీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గోదావరి తీరంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూముల లీజు గడువును మరో 20 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 23,953 హెక్టార్ల భూమి లీజు గడువు ముగిసిన నేపథ్యంలో తాజా ఉత్తర్వుల ద్వారా సింగరేణి సంస్థకు మరో 20 ఏళ్ల పాటు బొగ్గును ఉత్పత్తి చేసే వెసులుబాటు కల్పించినట్లయింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ సోమవారం జీవో 1,2,3 లను విడుదల చేసింది. సింగరేణి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు అటవీశాఖకు చెందిన భూములకు కూడా ఈ సందర్భంగా లీజు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో 26.44 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 6,848 హెక్టార్ల భూమి లీజు గడువు గత డిసెంబర్‌తో ముగిసిన నేపథ్యంలో సింగరేణి సంస్థ కోరిక మేరకు జనవరి ఒకటో తేదీ నుంచి 20 ఏళ్లపాటు లీజును పొడిగించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 62.88 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 12,611 హెక్టార్ల భూమి లీజు గడువు కూడా ముగిసిన నేపథ్యంలో ఈ భూమికి కూడా 20 ఏళ్ల వరకు లీజు కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
యుద్ధప్రాతిపదికన పనులు
జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సింగరేణి చైర్మన్, ఎండీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్లాంటు నిర్మాణ పురోగతిపై ఇక్కడి సింగరేణిభవన్‌లో సోమవారం సమీక్ష జరిగింది. వచ్చే నవంబర్ నాటికి ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని సింగరేణి యాజమాన్యం సీఎంకు నివేదించిన నేపథ్యంలో పనుల వేగం పెంచేందుకు ఈ సమీక్ష నిర్వహించారు. నీరు, బొగ్గు సరఫరా, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్, మెక్‌నల్లీ భారత్ కంపెనీల ఇంజినీర్లతో చర్చించారు.