
ఉపాధి కల్పన దిశగా ఆలోచించాలి : కోదండరాం
► అడిగే ప్రశ్నను చూడాలి తప్ప.. వ్యక్తిని కాదు
► టీపీటీఎఫ్ మహాసభలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
కొత్తగూడెంటౌన్: రాష్ట్రంలో విద్య, ఉపాధిలో నెలకొన్న సమస్యలపై, నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం ఆలోచించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పట్టణంలోని ఉర్దూఘర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) జిల్లాస్థాయి ప్రథమ మహావిద్యాసభకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల తరపున తాను ప్రశ్నించినందుకు... ప్రశ్న ఏమిటో ఆలోచించకుండా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సమస్యలున్నాయని చూపిస్తే.. చేతులు తనవైపు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే.. మంచే చేస్తున్నాం... సమస్యలు ఎక్కడున్నాయని ప్రభుత్వంలోని కొందరు తిరిగి ప్రశ్నిస్తున్నారన్నారు.
ఆధునిక సమాజంలో విద్య ప్రత్యేక వ్యవస్థగా మారిందని, సావిత్రీబాయి పూలే చదువు చెపుతానంటే ఆనాటి నిరంకుశ పాలకులు అడ్డుచెప్పారన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రైవేటు ప్రైమరీ బడులు వీధివీధినా కుప్పలుతెప్పలుగా వచ్చాయన్నారు. ప్రభుత్వ హయాంలో ప్రైవేటు యూనివర్సిటీలకు వందలాది ఎకరాల భూమిని ధారాదత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడంలేదన్నారు. ఆత్మకూరు, మహబూబాబాద్‌లను ఆదర్శంగా తీసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలన్నారు.
నిరుద్యోగులు, ఉపాధ్యాయులను పట్టించుకోకుండా కేసీఆర్ ఏకపక్షంగా నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రావు మా ట్లాడుతూ జిల్లాల విభజన రాజకీయ లబ్ధికోసం తప్ప ప్రజల కోసం కాదని, రాష్ట్రం ఇన్ చార్జిల పాలనలోనే కొనసాగుతుం దన్నారు. సభలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు జె.సరళ, బి.హనుమంతు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కె.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్ బి.ప్రసాదరావు, జిల్లా కార్యదర్శి కె.మాధవరెడ్డి ప్రసంగించారు.