టీడీపీ ప్రచార సామగ్రి సీజ్
అబిడ్స్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్నికల ప్రచార సామగ్రిని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆగాపుర ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి కామేశ్వరి, మంగళ్‌హాట్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఒక ఆటోలో తీసుకెళ్తున్న అట్టపెట్టెలను తెరిచి చూడగా.. అందులో చంద్రబాబునాయుడు ఫొటోతో కూడిన కీచైన్లు, శారీ క్లిప్స్, సైకిల్ గుర్తులతో కూడిన సామగ్రి కనిపించింది. ఆటో డ్రైవర్ ఫయీమ్‌ను దీనిపై ప్రశ్నించగా, తనకేమీ తెలియదని బేగంబజార్‌లోని అక్బర్ ట్రాన్స్‌పోర్టు నుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు తీసుకెళ్తున్నానని చెప్పాడు.
దీంతో అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకుని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు గోషామహల్ ఆర్వో చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్ ఫయీమ్‌ను అరెస్టు చేశామన్నారు.