
సాక్షి, నల్లగొండ : తమ సిట్టింగ్ స్థానమైన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాన్ని ఆశిస్తోంది. అభ్యర్థి ఎంపిక సందర్భంలోనే ఆ పార్టీ అగ్రనాయకత్వం సకల జాగ్రత్తలు తీసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది.
ఈ స్థానంలో విజయం సాధించి సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూర్‌నగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించనున్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆనవాయితీని కొనసాగించేలా..!
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక పర్యాయాలు గెలిచిన రికార్డు కాంగ్రెస్‌కు ఉంది. 1952 నుంచి 2014వరకు 1960లో జరిగిన ఉప ఎన్నిక సహా ఈ నియోజకవర్గానికి పదిహేడు పర్యాయాలు ఎన్నికలు జరిగితే..కాంగ్రెస్ ఏకంగా ఎనిమిది సార్లు వి జయం సాధించింది. పీడీఎఫ్, టీపీఎస్, సీపీఐ, టీడీపీ.. నాలుగు పార్టీలు కలిసి తొమ్మిది సార్లు గెలిచాయి. గత రెండు 2009, 2014 ఎన్నికల్లో వరసగా కాంగ్రెస్ గెలిచింది. ఈసారి గెలవడం ద్వారా పార్టీ హ్యాట్రిక్ సాధించాలని ఈ ఎన్నికను సవాలుగా తీసుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గుత్తా సుఖేందర్‌రెడ్డి 1.93లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో(2014) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలవగా, అందులో ఒకటి నల్లగొండ లోక్‌సభా స్థానం కావడం గమనార్హం. కానీ, పార్టీ నుంచి గెలిచిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీకి నల్లగొండ లోక్‌సభ స్థానంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోకవర్గం పరిధిలో కాంగ్రెస్ చేతిలో ఉండిన నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ స్థానాలను కోల్పోయింది. పార్టీని నిలబెట్టుకోవడానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం అనివార్యంగా మారింది.
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే టీపీసీసీ చీఫ్‌ను నల్లగొండ నుంచి, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరి స్థానం నుంచి బరిలోకి దింపార ని చెబుతున్నారు. కాగా, సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీకి పట్టున్న ప్రాంతంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని కాంగ్రెస్ గెలిచిన ఒకేఒక్క అసెంబ్లీ స్థానం హుజూర్‌నగర్. ఇక్కడి ఎమ్మెల్యేనే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తుండడంతో సభను సక్సెస్ చేసేందుకు హుజూర్‌నగర్‌ను ఎంపిక చేశారని అంటున్నారు. రాహుల్‌గాంధీ పాల్గొనే సభకు పార్టీ నాయకత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment