సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసానిచ్చేందుకు పాదయాత్ర చేయడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం సాయంత్రం రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే కొందరు రైతులు, టీపీసీసీ ముఖ్యనేతలతో కొద్దిసేపు భేటీ అవుతారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో ప్రయాణించి నిర్మల్(ఆదిలాబాద్ జిల్లా)కు చేరుకుని రాత్రికి హోటల్ మయూరా ఇన్‌లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కొరటికల్ గ్రామం నుంచి రాహుల్ పాదయాత్ర మొదలవుతుంది. లక్ష్మణచాందా, పోటుపల్లి, రాచాపూర్ మీదుగా వడ్యాల దాకా 15 కిలోమీటర్ల మేర ఆయన యాత్ర చేస్తారు.
ఈ గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున సాయం అందిస్తారు. రైతుల కుటుంబాల్లో భరోసా, ఆత్మస్థైర్యాన్ని నింపడానికే ఈ పాదయాత్ర చేస్తున్నట్టు టీపీసీసీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి రాహుల్ ప్రయాణించే రూట్‌మ్యాప్‌ను కూడా పార్టీ వెల్లడించింది. శంషాబాద్ నుంచి బయలుదేరి మాసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట, బోయిన్‌పల్లి, సుచిత్రా కాస్‌రోడ్డు, మేడ్చల్‌కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి తూప్రాన్, కామారెడ్డి, డిచ్‌పల్లి, మామిడిపల్లి, పెర్కిట్, బాల్కొండ మీదుగా నిర్మల్ చేరుకుంటారు. నేతలు విజ్ఞప్తి చేస్తే మార్గమధ్యంలో ఎక్కడైనా ఆగే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నేడు తెలంగాణలో రాహుల్ పర్యటన
Published Thu, May 14 2015 3:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement