
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సరుకు రవాణాలో రైల్వేలోని జోన్లలో మూడో స్థానంలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది వంద మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డు సృష్టించింది. రైల్వేకు ప్రధాన ఆదాయ కేంద్రాల్లో కీలకమైందిగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే లక్ష్యం విధించుకుని మరీ రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసి ఆదాయాన్ని భారీగా పెంచుకుంది. మార్చి 24 నాటికి ఈ మైలురాయిని అధిగమించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి జరిగిన రవాణా కంటే 5.82 మిలియన్ టన్నులు ఎక్కువగా సరుకును రవాణా చేసినట్టు పేర్కొంది. స్టీల్ ప్లాంట్లకు ముడిసరుకు రవాణాలో 32శాతం, ఇంపోర్టెడ్ ఐరన్ ఓర్‌లో 200%, సిమెంట్ లోడింగ్‌లో 3%, ఆహార ధాన్యాల్లో 38%, ఎరువుల తరలింపులో 11%, కంటెయినర్ లోడింగ్‌లో 20% పెరిగినట్టు పేర్కొంది. 100.122 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో.. గతేడాది కంటే 6.2 శాతం అధికంగా రవాణా చేసినట్టు తెలిపింది. ఈ రికార్డుపై దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మధుసూదనరావును ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment