ఖైరతాబాద్, భరత్‌నగర్ రైల్వే స్టేషన్ల పరిధిలో పట్టాలు దాటుతున్న ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: సెక్షన్ 147 భారత రైల్వే చేతిలో బ్రహ్మాస్త్రం. పట్టాలపైకి అనుమతి లేకుండా ఎవరైనా వచ్చినా.. ఎంతటివారినైనా అరెస్టు చేసే అధికారాన్ని కల్పించే చట్టం. దీని అమలు విషయంలో ఇంతకాలం కాస్త పట్టువిడుపుగా వ్యవహరించారు. అయితే, ఇటీవల అమృత్‌సర్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో అన్ని రైల్వే జోన్‌లలో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఏమిటీ చట్టం?
భారత రైల్వే చట్టంలోని సెక్షన్ 147.. 1989లో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రైల్వే పరిసరాలు, ఆస్తులకు సమీపంలో అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించినా శిక్షార్హులు. వీరికి రూ. 1000 జరిమానాతోపాటు 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. పరిస్థితులను బట్టి రెండింటినీ ఒకేసారి అమలు చేసే అవకాశాలున్నాయి. ఉద్య మ సమయంలో రైలు రోకోలో పాల్గొన్న చాలామంది నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం మనకు తెలిసిందే.
సివిక్ సెన్స్ లేకపోవడమే అసలు సమస్య..
పట్టాలపై నడవడం, సంచరించడం నేరమన్న విషయాన్ని రైల్వే నిరంతరం ప్రచారం చేస్తూనే ఉంది. అయినా, కొందరు వీటిని చెవికెక్కించుకోవడం లేదు. పౌరులు రైలు నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధానకారణమని రైల్వే పోలీసులు స్పష్టంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 2015 నుంచి 2017 వరకు దాదాపు 50 వేలమంది రైలు పట్టాలు దాటుతూ మృతి చెందడం గమనార్హం.
కఠిన చర్యలుంటాయి..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పట్టాలపై ఇష్టానుసారంగా సంచరిస్తే కఠిన చర్యలుంటాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌యూబీ, ఆర్వోబీ, సబ్‌వే, ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు, ఎస్కలేటర్లు వాడుకోవాలని స్పష్టంచేశారు. నేరుగా పట్టాలు దాటేవారికి, పట్టాలపై నిరసనలు, ధర్నాలు చేసినా, సామూహికంగా గుమిగూడినా, రైళ్ల ఆలస్యానికి కారణమైనా అరెస్టులు తప్పవన్నారు. పట్టాలపై సెల్ఫీలు తీసుకున్నా, ఫోన్లు మాట్లాడుతూ పట్టాలు దాటినా.. కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రయాణికులు, పౌరుల భద్రత కోసమే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment