
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు ముంచెత్తిన హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం కూడా పరిస్థితి కుదుటపడలేదు. సోమవారం కురిసిన భారీ వర్షాల ధాటికి నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. చాలాచోట్ల వరదనీరు రోడ్లపై పొంగిప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోడ్ల మీద వర్షపునీరు భారీగా చేరడంతో పలుచోట్ల అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వర్షపునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రధాన మార్గాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేబీఆర్ పార్క్-పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఎల్బీనగర్-కోఠి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది.
గడ్డి అన్నారం డివిజన్‌లోని కోదండరాం నగర్ నీటమునగడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఉన్న ఎస్సీ హాస్టల్‌లోకి నీరు చేరింది. దీంతో హాస్టల్‌లోని విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ భవానీ ప్రసాద్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. మసాబ్ ట్యాంక్, అహ్మద్ నగర్, మణికొండ పంచవటీ కాలనీలో భారీగా రోడ్లపై నీరు చేరడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు.
నాలాకు గండి
హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నాలాకు గండి పడటంతో... మురుగు నీరంతా బస్తీల్లోకి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, స్థానికులు మరమత్తులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా కరస్పాండెంట్ సిద్ధేశ్వర్ అందిస్తారు.
ఓయూలో సెలవు
సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు ముంచెత్తడంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా మంగళవారం సెలవు ప్రకటించింది. నగరంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు యూనివర్సిటీకి సెలవు ప్రకటిస్తున్నామని, మంగళవారం జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేశామని, వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఓయూ ఒక ప్రకటనలో తెలిపింది.





