రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటులో సిరిసిల్ల కేంద్రంగా వేములవాడ రాజన్న జిల్లా అనూహ్యంగా తెరపైకి వచ్చింది!
- భద్రాద్రి, యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న పేరుతో ఏర్పాటు
- సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలతో ఏర్పాటు చేసే యోచన
- సర్కారుకు నివేదించిన కలెక్టర్ నీతూప్రసాద్
- నేడు ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటులో సిరిసిల్ల కేంద్రంగా వేములవాడ రాజన్న జిల్లా అనూహ్యంగా తెరపైకి వచ్చింది! జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జగిత్యాల జిల్లాతోపాటు సిరిసిల్లను జిల్లాగా చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనయుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయన అభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు ప్రతిపాదన పంపినట్లు సమాచారం. మంగళ, బుధవారాల్లో హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సిరిసిల్ల జిల్లా ఏర్పాటు అంశం ప్రస్తావనకు వచ్చింది. భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై చర్చించారు. అనంతరం సీఎం కూడా సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.
మూడు నియోజకవర్గాలు కలిపి: రాష్ట్రంలో భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రాలు ప్రధాన ఆలయాలుగా ఉన్నాయి. వీటిలో భద్రాద్రి, యాదాద్రి పేరిట కొత్త జిల్లాలు అవతరించబోతున్నందున వేములవాడ రాజన్న పేరుతో సిరిసిల్ల-వేములవాడ నియోజకవర్గాలను కలుపుతూ కొత్తగా రాజన్న జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సీఎం కలెక్టర్ల సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి సూచనలతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాలపై సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతోంది. సిరిసిల్ల-వేములవాడ-చొప్పదండి నియోజకవర్గాలను కలిపి మొత్తం 15 మండలాలతో కొత్తగా రాజన్న జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ భేటీలో సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తెలుసుకుంటారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలతో సమీక్షకు రావాలని జిల్లా కలెక్టర్ సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్, డివిజన్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల డివిజన్‌లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు? ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలున్నాయి? జిల్లా కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఏది? కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల సముదాయం ఎక్కడ నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుంది? ప్రభుత్వ క్వార్టర్లు ఎన్ని ఉన్నాయి? ఏయే మండలాలను సిరిసిల్ల జిల్లాలో కలిపితే పాల నాపరంగా సౌకర్యంగా ఉంటుంది? అన్న అంశాలపై పూర్తి వివరాలతో సమావేశానికి రావాలని కలెక్టర్ ఆదేశించారు.