సాక్షి, ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల విక్రమ్‌రెడ్డి(28) దుర్మణం పాలయ్యారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. విక్రమ్‌రెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం పనులకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తన ద్విచక్రం వాహనంపై బయటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల నుంచి వస్తున్న బానోతు గంగు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విక్రమ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వివరించారు. ఆయనకు తల్లిదండ్రులు మంజుల– సత్యంరెడ్డి ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతం కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు.
పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి
జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ఆరుట్ల విక్రమ్‌రెడ్డి విశేష కృషి చేశారు. యూత్ విభాగాన్ని బలోపేతం చేయడంలో అహర్నిశలు శ్రమించారు. విద్యార్థులు, రైతుల సమస్యలపై పోరు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందినట్లు తెలియడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చినా విక్రమ్‌రెడ్డికి ఎంతో భవిష్యత్తు ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదినుంచీ ఆయన వైఎస్సార్‌సీపీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఏ కార్యక్రమాలు చేపట్టినా విజయవంతంగా పూర్తి చేసేవారు. విక్రమ్‌రెడ్డి సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా రెండేళ్ల క్రితం ప్రకటించింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలియడంతో హైదరాబాద్‌కి వెళ్లి ఆమెకు మద్దతు ప్రకటించారు. కొత్త పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామని చెప్పి వచ్చారు. అనూహ్యంగా విక్రమ్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం కలచివేసింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కన్నీటి పర్యంతమయ్యారు.
విక్రమ్‌రెడ్డి స్వగ్రామం పదిరలో తీవ్ర విషాదం నెలకొంది. టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, ఆర్‌ఎస్‌ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, సింగిల్‌విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రమేశ్‌గౌడ్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నర్సయ్య, తిరుపతిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. స్వగ్రామంలో విక్రమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. విక్రమ్ రెడ్డి మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని వైఎస్సార్‌సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి అన్నారు.
చదవండి: తల్లీకొడుకులపై పిడుగు
Comments
Please login to add a commentAdd a comment