సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్ బ్యాన్ అవసరమేనని కాని చిన్న వ్యాపారులను టార్గెట్ చేయడం సరికాదని జీహెచ్‌ఎంసీ అధికారులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ప్రభుత్వానికి, అధికారులకు చిత్త శుద్ధి ఉంటే ప్లాస్టిక్ ఉత్పత్తిని, పంపిణీ దారులను నియంత్రించాలన్నారు. శుక్రవారం బేగంబజార్‌లో 50 మైక్రాన్‌ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను అమ్ముతున్న షాపులపై జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడిచేశారు. నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న ఐదు షాపులను అధికారులు సీజ్ చేశారు.
షాపులపై అధికారుల దాడులను నిరసిస్తూ వ్యాపారస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. బేగంబజార్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న రాజాసింగ్ షాపులపై దాడులు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. షాప్ యజమానులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి దాడులను చేయవద్దని అధికారులను కోరారు. రాజాసింగ్ ఎంట్రీతో అధికార బృందాలు వెనుదిరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment