
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, బీజేపీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజాసింగ్.. పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నాను. దీని కంటే బయటికి వెళ్లడమే కరెక్ట్ అనుకుంటా. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని నేను సూచించాను. నేను చెప్పిన పేరు కాకుండా వేరే పేరు ఇవ్వడం ఏంటి?. కానీ, ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారు. పార్టీకి నా అవసరం లేదనుకుంటా?. ముందు ముందు ఏమవుతుందో చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు. తన సూచనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక, ఇదే సమయంలో.. ఈ విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని అర్థం అవుతుందంటూ రాజాసింగ్ వివరించారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment