కదిలిన మనసులు
రంగారెడ్డి జిల్లా అడాల్‌పూర్‌కు నీటి ఫిల్టర్ ఇచ్చిన రామకృష్ణ మఠం
‘సాక్షి’ కథనానికి స్పందన
యాలాల: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో గ్రామస్తులు పడుతున్న తాగునీటి కష్టాలకు హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం వారు స్పందించారు. రంగారెడ్డి జిల్లాలో కరువు పరిస్థితులపై శనివారం సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘ఇదేం కరువు-మాయమైన చెట్టు చెరువు’ కథ నంపై స్పందించారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అడాల్‌పూర్‌లో గ్రామస్తులు తాగునీటికి పడుతున్న కష్టాలను చూసి మఠం వారు చలించారు.
వేసవి కాలం ముగిసే వరకు ఫిల్టర్ నీరు సరఫరాతోపాటు, కాగ్నా నదిలో రూ.5 లక్షలతో బావి ద్వారా నీరందించేందుకు తీసుకుంటామని చెప్పారు. రామకృష్ణ మఠం ప్రతినిధి స్వామి పూర్ణ బోధానంద మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. నీళ్ల విషయంలో ప్రతిఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి నీటిబొట్టును ఆదా చేసుకునేందుకు ఇంకు డు గుంతలు తవ్వాలన్నారు. అడాల్‌పూర్ గ్రామంతోపాటు మండలంలోని రేళ్లగడ్డతండాకు వాటర్ బాటిళ్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు.