'నాన్నను కోల్పోయినప్పుడు ఎంతో అండగా ఉన్నారు'
హైదరాబాద్ : 'మేము నాన్నను కోల్పోయినప్పుడు రామానాయుడు గారు ఎంతో అండగా ఉన్నారు. ఆయన ఓదార్పు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. అటువంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉంది. రామానాయుడి లాంటి వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది' అని ఎంఎస్ నారాయణ తనయుడు విక్రమ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఓ నిమిషం పాటు మౌనం పాటించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాత ఎవరంటే చిన్నపిల్లాడిని అడిగినా రామానాయుడు అని చెబుతారని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. ఆయన మృతి చిత్రరంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. రామానాయుడు ఎప్పుడూ.. తన ఆస్తి డబ్బు కాదని.. అనేకమందిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయటమే తన ఆస్తి అని, అదే తనకు గర్వకారణమనే వారని ఈ సందర్భంగా కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. రామానాయుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారని, టెన్షన్ పడేవారు కాదని అన్నారు.