
రాంపూర్‌లో తెగబడిన దొంగలు
హుజూరాబాద్ టౌన్ : మండలంలోని రాంపూర్ గ్రామంలో పట్టపగలే దొంగలు శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళపై దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి భర్త వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన అవసరాల నిమిత్తం ఉదయమే హుజూరాబాద్ పట్టణానికి వచ్చాడు. ఆయన భార్య పద్మ ఒక్కరే ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. పద్మపై దాడిచేసి గాయపర్చారు.
ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, ఐదు తులాల బంగారం, 20 తులాల వెండిని తీసుకుని పారిపోయారు. చుట్టు పక్కల వారు గమనించి గాయపడిన పద్మను హుజూరాబాద్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.