ఇక్కడ రేషన్‌..అక్కడ మిల్లులు | Ration Rice Illegal Transport to Maharastra From Warangal | Sakshi
Sakshi News home page

ఇక్కడ రేషన్‌..అక్కడ మిల్లులు

Published Tue, Jul 2 2019 11:27 AM | Last Updated on Tue, Jul 2 2019 11:31 AM

Ration Rice Illegal Transport to Maharastra From Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : దళారుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్న రైస్‌ మిల్లుల వ్యాపారులు కొందరు మహారాష్ట్ర గొండియాలో బినామీల పేరిట మిల్లులు నడుపుతున్నారు. పాత వరంగల్, కరీంనగర్‌ జిల్లాల నుంచి సేకరించి బియ్యానికి ఆయా మిల్లుల్లో పాలిష్‌ పెట్టి రూ.లక్షలు గడిస్తున్నారు. ఇక్కడ క్వింటాల్‌కు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు కొనుగోలు చేసి గొండియాకు రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాపారులు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,100 చొప్పున ముందస్తు లెవీ చెల్లిస్తున్నారు. తద్వారా ఒక్కో క్వింటాల్‌పై రూ.500 నుంచి రూ.600 వరకు లబ్ధి పొందుతున్నారు. ఇలా రోజుకు ఒక్కో లారీ(200 క్వింటాళ్లు)పై రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు అంచనా.

బియ్యంపై డబ్బు.. మళ్లీ ధాన్యం
ఈ దందా దశల వారీగా సాగుతుంటుంది. తొలు త రేషన్‌ బియ్యం తీసుకునే లబ్ధిదారుల ద్వారా దళారులు సేకరిస్తారు. ఇక వారి నుంచి మిల్లర్లు సేకరించాక రేషన్‌ బియ్యాన్ని రైసుమిల్లులో దింపుకుని పాలిష్‌ పెట్టి మిల్లుల ద్వారా చెల్లించే ఒక ఏసీకే(270 క్వింటాళ్లు)ను బియ్యం కింద మహా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 400 క్వింటాళ్ల ధాన్యాన్ని ఇస్తుంది. అంటే 270 క్వింటాళ్లపై అప్పటికే రూ.1,35,000 
నుంచి రూ.1,62,000 వరకు సంపాదిస్తున్న వ్యాపారులు మళ్లీ 400 క్వింటాళ్ల ధాన్యం క్వింటాల్‌ను రూ.1800 కు విక్రయిస్తున్నారు.

తద్వారా 270 క్వింటాళ్ల బియ్యానికి రూ.5,67,000 అవుతుండగా.. 400 క్వింటాళ్ల ధాన్యం విలువ రూ.7.20 లక్షలకు చేరుతోంది. ఇలా విక్రయించడం ద్వారా ఒక్క ఏసీకేపై రూ.1,53,000 వరకు అదనంగా సదరు వ్యాపారుల జేబుల్లోకి వెళ్తోంది. నెలలో కనీసం 15 నుంచి 20 ఏసీకేల టర్నోవర్‌ చేస్తున్న వ్యాపారులు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ దందాకు కొందరు రెవెన్యూ, పౌరసరఫరా, పోలీసుశాఖ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు తెలుస్తుండగా.. కాళేశ్వరం వంతెన ద్వారా గొండియాకు యథేచ్ఛగా రవాణా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. 

‘రూపాయి’పై రాబంధులు
బహిరంగ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.35 నుంచి రూ.48 పలుకుతుండటంతో రేషన్‌ బియ్యానికి గిరాకీ పెరుగుతోంది. సంచులు మార్చి.. పాలిష్‌ పెట్టి ఎల్లలు దాటిస్తూ రూ.లక్షలు గడించాలనే ఆశతో ఉన్న దళారులు, కొందరు రైస్‌మిల్లర్లకు ఇది వరంగా మారింది. మహారాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌ జిల్లాల చివరి గ్రామా లే అడ్డాలుగా.. కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన ద్వారా మహారాష్ట్రలోని గొండియాకు తరలిస్తున్నారు. ఇలా తరలిస్తున్న రెండు లారీల(400 క్విం టాళ్లు) రేషన్‌ బియ్యాన్ని ఈనెల 12 పాత వరంగల్, కరీంనగర్‌ జిల్లాల పోలీసులు పట్టుకోవడంతో ఈ గుట్టు రట్టయ్యింది. వరంగల్‌ నుంచి మహారాష్ట్రకు లారీ(సీజీ 04 జేసీ 0996)లో 200 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా మహదేవపూర్‌ మండలం కుదురుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు.

ఈక్రమంలో వ్యాపారి సాదుల నవీన్, అతని గుమస్తా సదానం దం, లారీ డ్రైవర్‌ బూపేంద్రకుమార్‌పై కేసులు నమోదయ్యాయి. వరంగల్, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దులో మరో 50 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి జిల్లా అధికారులు పట్టుకోగా, హుజూరాబాద్‌ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న లారీ, 400 క్వింటా ళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో దందా ఎంత యథేచ్ఛగా సాగుతోందని వెలుగు చూసింది. ఎన్నికల సమయంలో కాళేశ్వరం వంతెన వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను పోలీసులు ఎన్నికల కోడ్‌ ముగియగానే ఎత్తివేశారు. ఆ మరుసటి రోజే రేషన్‌ బియ్యం పట్టుబడడం గమనార్హం. ఒకటి, రెండు లారీలు పట్టుబడినా ఆ తర్వాత నుంచి ఇప్పటికీ దందా నిత్యకృత్యంగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement