పేదల బియ్యం పక్కదారి | Ration Rice Smuggling in Hyderabad | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం పక్కదారి

Published Mon, Feb 18 2019 10:28 AM | Last Updated on Mon, Feb 18 2019 10:28 AM

Ration Rice Smuggling in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పడుతోంది. పేదల బియ్యం మళ్లీ దారిమళ్లుతున్నాయి. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్‌ ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుండడంతో బియ్యం బకాసురులు కొత్త పంథాను ఎంచుకున్నారు. లబ్ధిదారులకు డబ్బు ఆశ చూపి బియ్యాన్ని వారినుంచే తన్నుకు పోతున్నారు. పేదలతో పాటు మధ్య తరగతి వారు కూడా ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులుగా ఉండడం అక్రమార్కులకు మరింత కలసి వస్తోంది. వాస్తవంగా మధ్య తరగతి ప్రజలు చౌక బియాన్ని తీసుకోవడానికి ఇష్ట పడడంలేదు. ఒకవేళ బియ్యం తీసుకున్నా వాడుకోవడం లేదన్నదిబహిరంగ రహస్యమే. దీంతో వారు కార్డుపై తీసుకున్న బియ్యాన్ని కేజీకి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. చిరు వ్యాపారులు ఏకంగా ఆటోలను కాలనీల్లో తిప్పుతూ బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు. ఒక్కో ఇంట్లో సుమారు 20 నుంచి 30 కిలోల వరకు చౌక బియ్యం లభిస్తుండడంతో ఇంటింటికీ ఆటోలు తీసుకువెళ్లి వాటిని సేకరిస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని బస్తాల్లో నింపి పెద్ద వ్యాపారులకు కిలోకు రూ.12 నుంచి రూ.15 ధరకు విక్రయిస్తున్నారు. వారు వాటిని కర్ణాటక, మహారాష్ట్రలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ప్రభుత్వం ఒక కేజీ బియ్యాన్ని కొనేందుకు రూ.23 వరకూ వెచ్చిస్తోంది. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాయితీపై రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది.

నగర శివార్లలోనే దందా
గ్రేటర్‌ నగర శివార్లలోనే చౌక బియ్యం కొనుగోళ్ల దందా అధికంగా జరగుతునట్లు సమాచారం. ఇటీవల నగర శివారులో పౌరసరఫరాల విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించగా పొరుగు రాష్ట్రాలకు తరులుతున్న చౌక బియ్యం బస్తాలు పట్టుబడ్డాయి. నగర పరిధిలోనూ బియ్యాన్ని సేకరించి ఆ తరవాత వాటిని ఆటోల్లో ఒకచోట చేర్చి అక్కడి నుంచి డీసీఎం వాహనాల్లో పొరుగు రాష్ట్రాలకు పంపించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మహేశ్వరం వద్ద 9 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా అధికారులు గుర్తించారు.

గ్రేటర్‌ పరిధిలో ఇదీ పరిస్థితి..  
హైదరాబాద్‌–రంగారెడ్డి– మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రతినెలా చౌకదుకాణాల ద్వారా సుమారు 11 లక్షలకు పైగా ఆహార భద్రత లబ్ధి కుటుంబాలకు సుమారు 30 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యం ఒక రూపాయి చొప్పున కుటుంబంలో ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అన్ని ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం కోటా కేటాయిస్తోంది. వాస్తవంగా నిరుపేద కుటుంబాలకు చౌక బియ్యం పంపిణీ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అయితే మధ్య తరగతి కుటుంబాలు మాత్రం దుర్వినియోగానికి పాల్పుడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ఈ–పాస్‌ అమలుకు ముందు డీలర్లు చేతివాటం ప్రదర్శించి బియ్యాన్ని పక్కదారి పట్టించేవారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ–పాస్‌ అమలు అనంతరం బియ్యం కోటాలో దాదాపు 20 నుంచి 35 శాతం మేర ఆదా అయింది. అంటే కార్డుదారులు కచ్చితంగా చౌక దుకాణానికి వచ్చి వేలిముద్ర వేసిన తర్వాత మాత్రమే బియ్యం తీసుకునేలా ఏర్పాటు చేయడంతో అక్రమాలకు తెరపడింది. బియ్యాన్ని తరలించే వాహనాలను కూడా జీపీఆర్‌ఎస్‌ ద్వారా పర్యవేక్షించే పద్ధతి అమలు చేయడం వల్ల గోదాముల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యాన్ని తరలించేప్పుడు జరిగే అక్రమాలను కట్టడి చేశారు. నిబం«ధనల ప్రకారం చౌక బియ్యం కొనడం.. అమ్మడం నేరం. వాస్తవంగా కొందరు లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోతే ఆహారభద్రత కార్డు రద్దవుతుందన్న భయంతో అవసరం లేకపోయినా బియ్యం తీసుకుంటున్నారు. అలా తీసుకున్న బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే, కార్డుదారులు బియ్యం తీసుకోకపోయినా రేషన్‌ కార్డు రద్దు కాదని, ఎలాంటి సందేహం అవసరం లేదని పౌరసరఫరాల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement