
బాబుతో కేంద్ర మంత్రి రవిశంకర్ భేటీ
ఐటీ రంగ అభివృద్ధికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: దేశంలో సమాచార సాంకేతిక విజ్ఞాన (ఐటీ) రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. సాంకే తిక పరిజ్ఞానం వినియోగంలో చంద్రబాబు ఇతర రాష్ట్రాల సీఎంలకు మార్గదర్శనం చేయాలన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రవిశంకర్ ప్రసాద్ శనివారం చంద్రబాబుతో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో ఈ భేటీ వివరాలను వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కాగిత రహిత మంత్రివర్గ సమావేశంపై దేశం అంతా ఆసక్తి ప్రదర్శించిందని రవిశంకర్ చెప్పారు. విజ్ఞాన వినియోగంలో ఏపీ ముందుందంటూ ప్రశంసించారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధార్‌ను అనుసంధానం చేయటం వల్ల వందల కోట్ల ప్రజా ధనం ఆదా అయ్యిందని అన్నారు. ఆధార్‌తో ఫించన్లు, ఇతర పథకాలను అనుసంధానం చేయటం వల్ల రాష్ర్టంలో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోస్టాఫీసులు, టెలికం సేవలను ఎలా వినియోగించుకోవాలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.