రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్ధతు ధరను ప్రతి రైతుకు అందించి అన్నదాతకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని...
- సమష్టిగా సమస్యలను అధిగమించాలి
- తూకంలో కోతలు వద్దు
- సమస్యల పేరుతో బంద్‌లు చేపట్టవద్దని రైతు సంఘాల మొర
- మార్కెట్ సమస్యలపై ఆర్డీఓ ముత్యంరెడ్డి సమీక్ష
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్ధతు ధరను ప్రతి రైతుకు అందించి అన్నదాతకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డులో అధికారులు, ఐకేపీ, హమాలీలు, రవాణా కంట్రాక్టర్, ట్రేడర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లాలోనే పెద్ద మార్కెట్ అయిన సిద్దిపేటకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.
కనీస మద్ధతు ధరను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి చేయూతగా నిలవాలని సూచించారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్క, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1400, సాధారణ రకానికి రూ. 1360 చెల్లించేలా అధికారులు, ట్రేడర్లు చొరవ చూపాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మక్కలను త్వరితగతిన గోదాములకు తరలించేలా చూడాలన్నారు. అంతకుముందు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు సమయంలో ఉత్పన్నమయ్యే చిన్న సమస్యలపై ఆర్డీఓ విభాగాల వారీగా సమీక్షించారు.
ముందుకు హమాలీల సమస్యలపై మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి బస్తాకు కోత పేరిట తీసుకునే సంస్కృతిని విడనాడాలన్నారు. అదే విధంగా లోడింగ్ సమయంలో హమాలీలు డిమాండ్ చేసే పద్ధతి మంచిది కాదన్నారు. రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ సమస్యల సాకుతో నెలలో అత్యధిక రోజులు బంద్ నిర్వహించడం వల్ల రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పేరిట కొనుగోళ్లకు ఆటంకం కలిగించొద్దని హమాలీలకు, ట్రేడర్లకు, అధికారులకు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. సమీక్షలో ఓఎస్‌డీ బాలరాజు, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య, అధికారులు పరమేశ్వర్, రైస్‌మిల్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌తో పాటు ఐకేపీ అధికారులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు చేయూత నివ్వాలి
వైద్యం కోసం సర్కార్ దవాఖానకు వచ్చే నిరుపేదలకు చేయూతగా నిలవాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని ఆర్డీఓ ముత్యంరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఎంసీహెచ్ ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వైద్యులపై ప్రజల్లో నమ్మకం ఉందని, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మెరుగైన వైద్యాన్ని అందించి సేవాభావంతో మెలగాలన్నారు. రోగులపట్ల ఉదారంగా వ్యవహరించాలని సూచించారు.
వైద్యులు, సిబ్బందిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నామని శాఖాపరమైన చర్యల ద్వారా సత్ఫలితాలు సాధించేది కష్టమేనన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల, సిబ్బంది పని తీరు, ప్రసూతి సేవలు, శస్త్ర చికిత్సలు తదితర వైద్య సేవలపై ఆరా తీసేందుకే ప్రభుత్వ పక్షాన ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిన్న చిన్న సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమిష్టిగా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని పిలుపునిచ్చారు. సమీక్ష సమావేశంలో ఓఎస్‌డీ బాల్‌రాజు, హైరిస్క్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ కాశీనాథ్‌తో పాటు, వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.