సాక్షి,సిటీబ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2019కు నగరంలో 103 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, కో ఆర్డినేటింగ్ సూపర్‌వైజర్ మాణిక్‌రాజ్ కన్నన్ తెలిపారు. గురువారం ఇందిరా ప్రియదర్శని ఆడిటోరియంలో పరీక్షల నిర్వహణపై నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పరీక్షకు 49,033 మంది హజరవుతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు ఉంటుందన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగా ఆయా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద సూపర్‌వైజర్లతో పాటు లోకల్ ఇన్‌స్పెక్షన్ అధికారులు ఉంటారని, 36 మంది రూట్ అఫీసర్లు, ఏడుగురి అదనపు ఆఫీసర్లను నియమించామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించేందుకు ఆరుగురు ఎగ్జ్సామినేన్ అబ్జర్వర్లను సైతం నియమించినట్లు చెప్పారు.
అభ్యర్థుల నిబంధనలు ఇవీ..
పరీక్ష రాసే అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్‌డ్రైవ్, వాచీలు, క్యాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, పర్సులు, వాలెట్లు, నోట్స్, చాట్స్, ఇతర రికార్డింగ్,ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. రిపోర్టింగ్ టైమ్‌లోగా పరీక్షకు హాజరు కావాలని, క్లోజింగ్ టైమ్ తర్వాత పరీక్షకు అనుమతించరన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు
పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ సూపర్‌వైజర్లు సిట్టింగ్ అరేంజ్‌మెంట్లతో పాటు ఇన్విజిలేటర్లను నియమించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, కేంద్రాల్లో తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణలో అనుసరించాల్సిన విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో డీఆర్వో భూపాల్‌రెడ్డి, ఎగ్జామినేషన్ అబ్జర్వర్లు హైమావతి, సిక్తా పట్నాయక్, లోకల్ ఇన్స్‌పెక్టింగ్ అధికారులు, రూట్ అధికారులు, రెవెన్యూ ఇంచార్జిలు పాల్గొన్నారు.
సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప్రత్యేక బస్సులు
సాక్షి,సిటీబ్యూరో: వచ్చేనెల 2వ తేదీన జరిగే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 7 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఆయా సమయానికి అనుగుణంగా నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో అదనపు బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సులకు ‘యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ స్పెషల్’ అనే తాత్కాలిక డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. బస్సుల సమాచారం కోసం అభ్యర్థులు 99592 26160, 99592 26154 నంబర్లలో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment