రియల్ దందా !
► అచ్చంపేటలో అక్రమ లేవుట్లు
► అనుమతులు లేకుండానే 300 ఎకరాల్లో వెంచర్లు
► రూ.30లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండి
అచ్చంపేట : రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లేవుట్లతో దందా సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వెంచర్లు వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావల్సిన 10శాతం ఆదాయం రాకపోగా, గ్రామపంచాయతీకి కేటాయించాల్సిన 10శాతం స్థలం కూడా వారు ఇవ్వడంలేదు. వెంచర్ల గురించి భారీగా ప్రచారం చేస్తుండటంతో ప్రజలు మోసపోయి వాటిని కొనుగోలు చేస్తున్నారు. రియల్ వ్యాపారులకు రాజకీయనాయకులతో సంబంధాలు ఉండటంతో అధికారులు వీరిపై చర్య తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.
అచ్చంపేట- నాగర్‌కర్నూల్ ప్రధాన రోడ్డులోని పోలిశెట్టిపల్లి శివారులో 56/ఈ సర్వేనం.లో రియల్ వ్యాపారులు లేవుట్లు అనమతులు లేకుండానే ప్లాట్లుగా మార్చి వ్యాపారం సాగిస్తున్నారు. పట్టణానికి అనుచరించి ఉన్న పొలిశెట్టిపల్లి గ్రామ పంచాయతీకి వస్తుండటంతో నగరపంచాయతీ వారు జోక్యం చేసుకోవడం లేదు. సాయినగర్ కాలనీలో రైస్‌మిల్లు వద్ద వ్యాపార సమూదాయం, గజావానికుంట, దాని వెనకభాగంలో ఇటీవల వెంచర్లు వెలిచాయి. నిబంధనల ప్రకారం లేవుట్లు లేకపోయినా అనుమతులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇవీ నిబంధనలు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మార్చేందుకు తప్పనిసరిగా లేవుట్ చేయించాలి. మొదట లేవుట్ కోసం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం రికార్డులను గ్రామపంచాయతీకి అప్పగించాలి. రెండున్నర ఎకరాలకు జిల్లా స్థాయి, ఐదు ఎకరాలలోపు రీజియన్‌స్థాయి, ఆపై దాటితే రాష్ట్రస్థాయి టౌన్ ప్లానింగ్ అధికారుల సర్వే చేస్తారు. దరఖాస్తుదారులు 10శాతం భూమిని ప్రజాప్రయోజనాల కోసం ఖాళీగా వదలాలి. వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మార్చేందుకు మార్కెట్ విలువ ప్రకారం (రిజిస్టేషన్ లెక్కప్రకారం) ఎకరా లక్ష ఉంటే అందులో రూ.10వేల ఫీజు చెల్లించిన తర్వాత లేవుట్ మంజూరు ఇస్తారు.
30ఎకరాలు..
రూ.30లక్షలు గండి
లేఅవుట్లు తీసుకోని కారణాంగా నియోజకవర్గంలోని 300 ఎకరాల్లో పంచాయతీలకు దక్కాల్సిన 30 ఎకరాల భూమిని రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి అందాల్సిన 10శాతం డబ్బు సుమారు రూ.30లక్షల ఆదాయం అందలేదు. అక్రమ లే అవుట్ల గురించి అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. ఎక్కడా వారికి నోటీసులు ఇచ్చిన దాఖ లాలు లేవు.
ఎక్కడెక్కడ చేశారంటే...
అచ్చంపేట 2013లో నగరపంచాయతీగా మారింది. పాత తేదీల్లో సర్పంచు సంతకాలతో లేవుట్ అనుతమలు చూయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం టౌన్‌ప్లానింగ్ అనుమతితో కార్యదర్శి సంతకం ఉంటేనే లేవుట్ చెల్లుతుంది. పట్టణంలో సుమారు 100ఎకరాల్లో అనుమతులు లే కుండా 20కిపైగా వెంచర్లు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి, అచ్చంపేట మండలం పులిజాల, నడింపల్లి, హాజీపూర్, చౌటపల్లిరోడ్డు, సింగారం, బ్రహ్మణపల్లి, ఉప్పునుంతల మండలం వెల్టూర్, లత్తీపూర్‌లో మరో 200ఎకరాల్లో వెంచర్లు చేశారు. వీటికి పంచాయతీల అనుమతులు లేవు.