![అనగనగా.. ఓ శ్రీమంతుడు](/styles/webp/s3/article_images/2017/09/17/71502481634_625x300.jpg.webp?itok=TngFs3qR)
అనగనగా.. ఓ శ్రీమంతుడు
► సామాన్యుడిగా జీవించిన వేల కోట్ల వజ్రాల వ్యాపారి
► చేతిలో చిల్లిగవ్వ లేకుండా భాగ్యనగరంలో జీవనం
చిటికెలో కో.. అంటే కోట్లు రాలే జీవితం.. విశ్వవ్యాప్తంగా హైటెక్ కార్యాలయాలు.. దేశవిదేశాలకు ఎగుమతులు... వేలాది మంది ఉద్యోగులు.... కాలు కదపకుండా.. కడుపులో చల్ల కదలకుండా సేవలందించే నౌకర్లు.. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అతడు. నడిచొచ్చే వజ్రాల గని అతడు.
అంతటి శ్రీమంతుడు దిగివచ్చాడు. జేబులో పర్సు.. చేతిలో ఫోన్ లేకుండా భాగ్యనగరంలో నెల రోజులపాటు సామాన్యుడిగా బతికాడు. ముప్పై రోజుల జీవన ప్రస్థానంలో సికింద్రాబాద్‌లోని పాత డార్మెటరీలో పడుకున్నాడు. చిరుద్యోగులు, కార్మికుల జీవనౖశైలిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తన బాధలు, ఆనందక్షణాలను వారితో పంచుకున్నాడు. ఆస్తిపాస్తులు లేకపోయినా వారంతా ఆనందంగా గడపడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని.. తనలో స్ఫూర్తిని నింపిందని ఉద్వేగంగా చెప్పాడు. ఎవరా శ్రీమంతుడు! ఏమిటతని ప్రత్యేకత! రీల్ జీవితాన్ని తలపించిన రియల్ స్టోరీ ఇది. – హైదరాబాద్
హితార్థ్ ధోలాకియా... 23 సంవత్సరాలు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బడా వజ్రాల వ్యాపారి. ‘హరికృష్ణా ఎక్స్‌పోర్ట్స్’అధినేత ఘన్‌శ్యామ్ ధోలాకియా కుమారుడే ఇతను. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఇటీవలే సూరత్‌కి తిరిగొచ్చాడు. ఇక జీవితం హ్యాపీ అనుకుంటున్న సమయంలో నాన్న అతనికి ఓ సవాలు విసిరాడు. తానెవరో ఎవరికీ చెప్పకుండా నెలరోజుల పాటు అతి సాధారణ జీవితం గడపాలని, సొంతగా సంపాదించి చూపాలని తండ్రి ఆదేశించాడు. గుర్తింపు కార్డులు, మొబైల్‌ఫోన్ లేకుండా కేవలం 500 రూపాయలతో హితార్థ్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.
భాగ్యనగరంలో బతుకుపోరాటం...
తనకు ఏమాత్రం సంబంధం లేని హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న హితార్థ్ జూలై తొలివారంలో నగరంలో విమానం దిగిన వెంటనే ఉద్యోగ వేటలో పడ్డాడు. పలు దుకాణాలు, చిరు కంపెనీలను ఉద్యోగం కోసం సంప్రదించాడు. అడుగుపెట్టిన ప్రతీచోటా తన చిరునామా, గుర్తింపు కార్డు, ఫోన్ నంబర్, ఆధార్‌కార్డు సహా అన్ని వివరాలు అడిగారు. చివరకు తన వివరాలు వారంలో ఇస్తానని చెప్పి మెక్‌డోనాల్డ్స్ ఫుడ్‌కోర్ట్, ఆడిదాస్ షోరూం, చిల్లీస్ రెస్టారెంట్ సహా సికింద్రాబాద్‌లోని కార్డుబోర్డ్ షాపుల్లో దినసరి కార్మికునిగా నెలరోజుల పాటు బతుకుపోరాటం చేసి సంపాదించాడు. ఆ వచ్చిన దాంతోనే సరిపెట్టుకున్నాడు.
కుటుంబ ఘనచరిత్ర...
కొంత కాలం క్రితం హితార్థ్ పినతండ్రి కూడా ఇదే తరహాలో తన కుమారుడిని సామాన్యుడిలా బతకాలని చెప్పి కేరళకు పంపాడు. ఇక హితార్థ్ తండ్రి ఘన్‌శ్యామ్ కూడా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి కానుకగా 1200 కార్లు, ఖరీదైన ఫ్లాట్లు బహుమతులుగా ఇచ్చి వార్తల్లోకెక్కిన విషయం విదితమే. ఈ వివరాలన్నింటినీ శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌దక్కన్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హితార్థ్ చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఈ సమావేశంలో అతడి పినతండ్రి, వారి కుటుంబ స్నేహితుడు, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌త్రివేది పాల్గొన్నారు.
అజ్ఞాతవాసం లాంటి జీవితమిది
హితార్థ్ కుటుంబంతో నాకు స్నేహం ఉంది. అతను నెలరోజుల క్రితం ఇక్కడకు వచ్చినప్పుడు నాకు తెలియదు. నా సహాయం అడగలేదు. రాజుల కాలం నాటి అజ్ఞాతవాసం లాంటిదే ఇది. జీవితమంటే డబ్బు మాత్రమే కాదు... పేదల జీవనశైలి స్వయంగా అనుభవించడం ద్వారా హితార్థ్ గొప్ప అనుభవం, పరిణతి సాధించాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాని అనుభవం ఇది. ప్రతి సంపన్నుడూ వారి పిల్లలకు కనీసం కొంతకాలం సామాన్య జీవితం గడపేలా ప్రోత్సహించాలి. తద్వారా ఎన్నో భ్రాంతులు, భ్రమలు తొలగిపోతాయి. – రాజీవ్‌త్రివేది, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి
జీవితానుభవం సాధించా: హితార్థ్
నెల రోజుల పయనంతో జీవిత కాలం అనుభవం సంపాదించా. ప్రతిచోటా నా గుర్తింపు అడిగారు. సామాన్యులు, కార్మికుల జీవనశైలిని స్వయంగా అనుభవించడం, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మా నాన్న నన్ను ఇందుకు ప్రేరేపించారు. ఇరుకు గదుల్లో నేలపై పడుకోవడం, ఇతర కార్మికులతో కలసి సామాన్లు మోయడం, వారితో కలసి భోజనం చేయడం నా జీవిత దృక్పథాన్ని మార్చింది.
సూరత్‌లోని మా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి, వారికి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇంకా ఏమి చేయవచ్చో తెలుసుకున్నాను. హైదరాబాద్ నన్ను ఎంతో ఆదరించింది. ఇక్కడ అడుగడుగునా సీసీ కెమెరాలు ఉండడం ఆశ్చర్యపరిచింది. కొద్దిగా కష్టపడే తత్వం, నైపుణ్యం ఉంటే హాయిగా బతకవచ్చని నిరూపించింది. నాకు పని ఇచ్చిన యజమానులకు ధన్యవాదాలు.