2022 లోపు రైతు ఆదాయం రెట్టింపు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని రైతుల ఆదాయాన్ని 2022 లోగా రెట్టింపు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు బహుముఖ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) ప్రాంతీయ కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకు కార్యకలాపాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మందికిగాను 7.5 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో నాబార్డు 2015–16లో రూ.7,700 కోట్లు, 2016–17లో రూ. 9,200 కోట్ల రుణ సహాయం చేసిందని చెప్పా రు. ఆర్‌ఐడీఎఫ్ కింద 9.75 శాతం వడ్డీతో రుణ సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, నాబార్డు తెలంగాణ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్, ఏపీ శాఖ సీజీఎం సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.